నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్.. ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా వుంటోంది.. అన్నామలై
నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్ అయినప్పటికీ ఎటువంటి జవాబుదారీతనం లేదని ఆరోపిస్తూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మాజీ బీజేపీ నేత కె. అన్నామలై బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే, నిరసనకారులతో చర్చలు ప్రారంభించడానికి కేంద్రం ఎందుకంత సమయం తీసుకుందని ఆయన ప్రశ్నించారు.
ప్రస్తుతం వీ ద లీడర్స్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అన్నామలై, నిరసన తీవ్రరూపం దాల్చే వరకు అర్థవంతమైన చర్చలు ఎందుకు జరగలేదని నిలదీశారు. అసలు ప్రభుత్వం ఎందుకు వేచి చూసిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ఆందోళనలను పరిష్కరించేందుకు అర్థవంతమైన చర్చలు జరపాలని, పారదర్శకతను పాటించాలని, త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాలని తాను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నామలై వెల్లడించారు.
దేశ సంస్థలపై యువతకు ఉండే నమ్మకమే ఆ దేశ బలానికి మూలం. మన విద్యా వ్యవస్థ నిష్పాక్షికత, విశ్వసనీయతపై విద్యార్థులు నమ్మకం కోల్పోతే, మనం మన దేశ భవిష్యత్తునే ప్రమాదంలో పడేసినట్లవుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
