శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 నవంబరు 2015 (09:52 IST)

నరేంద్ర మోడీ హవా తగ్గినట్టే.. కమల వికాసం ఇప్పట్లో లేనట్టే!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా తగ్గిపోతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోమారు దీన్ని రుజువు చేశాయి. ఇదే విషయాన్ని దేశంలో ప్రచురితమయ్యే ఓ ప్రముఖ వార పత్రిక కూడా తేటతెల్లం చేసింది కూడా. అయినప్పటికీ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్దగా పట్టించుకోకుండా, బీహార్ ఎన్నికల్లో అన్నీ తానై ముందుండి నడిపించారు. అయినా ఫలితం దక్కలేదు కదా భంగపడ్డారు. గత అసెంబ్లీ ఉన్న సీట్ల కంటే 38 సీట్లు తక్కువతో సరిపుచ్చుకున్నారు. దీంతో బీహార్‌లో వాడిపోయిన కమలం.. ఇప్పట్లో దేశంలో ఎక్కడా వికసించే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. దీనికి స్పష్టమైన కారణాలు లేకపోలేదు. 
 
వచ్చే 2016లో దేశంలోని నాలుగు ప్రధాన రాష్ట్రాలతో సహా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే సూచనలు దర్పణం వేసి చూసినా కనిపించవు. ఈ రాష్ట్రాల్లో ప్రాంతీల పార్టీలదే హవా. జాతీయ పార్టీ అయిన బీజేపీకి అంత ప్రాబల్యం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. స్థానికంగా పటిష్టమైన నాయకత్వం కూడా నామమాత్రంగానే ఉంది. దీంతో స్థానిక పార్టీలకే ప్రజలు పట్టంగడుతూ వస్తున్నారు. 
 
ఒక్కో రాష్ట్రంలోని స్థానిక పార్టీలను పరిశీలిస్తే... పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌, జాతీయ పార్టీ అయిన సీపీఎంల మధ్యే హోరాహోరీ పోటీ ఉంటుంది. ఇక్కడ బీజేపీకి ఆశించిన స్థాయిలో క్యాడర్‌ లేదు. దీంతో అధిక సీట్లను ఆశించలేం. 
 
తమిళనాడు రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మధ్యే తీవ్రపోటీ. ఇక్కడి ప్రజలు కూడా ఈ రెండు పార్టీలకే అధికారం మార్చిమార్చి అప్పగిస్తుంటారు. కాంగ్రెస్‌, బీజేపీ వంటి జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ.. ఇవి ఏడీఎంకే లేదా డీఎంకేల చెంతకు చేరాల్సిందే. 
 
అలాగే, కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌, లెఫ్ట్‌ పార్టీల నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ కూటముల మధ్యే కొన్ని దశాబ్దాలుగా పోరు సాగుతోంది. ఈ క్రమంలో ఇక్కడ కమలనాథులకు కూడా భంగపాటు తప్పదు. అలాగే, ఈశాన్య రాష్ట్రమైన అస్సాం విషయానికి వస్తే.. ఇక్కడ జాతీయ పార్టీ కాంగ్రెస్‌, స్థానిక పార్టీ అస్సాం గణపరిషత్‌ల మధ్యే పోటీ. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీలు అయిన ఎన్ఆర్ కాంగ్రెస్, డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే ప్రధాన పోటీ. ఇక్కడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్. రంగాస్వామికే పుదుచ్చేరివాసులు పట్టంకడుతుంటారు. దీంతో కమలం ఇప్పటికే వికసించే అవకాశాలు లేవని తెలుస్తోంది.