1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Biodiversity Day: ITC Limited Strengthens Coastal Ecology Through Mangrove Conservation

జీవవైవిధ్య దినోత్సవం: ఐటీసీ మడ అడవుల సంరక్షణ ద్వారా తీరప్రాంత పర్యావరణ వ్యవస్థ బలోపేతం

Field
గ్లోబల్ ఇంపాక్ట్ కోసం స్థానికంగా వ్యవహరించడం అనే ఇతివృత్తంతో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో, ఐటీసీ చేపట్టిన భారీ, సమీకృత జీవవైవిధ్య సంరక్షణ కార్యక్రమాలు క్షేత్రస్థాయి చర్యల ప్రాముఖ్యతను చాటుతున్నాయి. ఇవి పర్యావరణపరంగా అద్భుతమైన ఫలితాలను అందించడంతో పాటు, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచి, ఉపాధి అవకాశాల సృష్టికి ఎలా తోడ్పడతాయో నిరూపిస్తున్నాయి.
 
ఉమ్మడి సహజ వనరులు అత్యంత కీలకమైన పర్యావరణ మౌలిక సదుపాయాలు అనే నమ్మకంతో, ఐటీసీ తన భారీ సుస్థిరత కార్యక్రమంలో జీవవైవిధ్య సంరక్షణను మిళితం చేసింది. ఇందులో భాగంగా జల సంరక్షణ, అటవీ పెంపకం, వాతావరణ అనుకూల వ్యవసాయం వంటి వాటిని చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఐటీసీ చేపట్టిన జీవవైవిధ్య కార్యక్రమం ఇప్పటివరకు భారతదేశంలోని 10 రాష్ట్రాల్లో దాదాపు 7.8 లక్షల ఎకరాలకు విస్తరించింది. తమ సస్టైనబిలిటీ 2.0 ఎజెండాలో భాగంగా 2030 నాటికి ఈ కార్యక్రమం కింద 10 లక్షల(మిలియన్) ఎకరాలను చేరుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
 
సమీకృత జీవవైవిధ్య సంరక్షణ కార్యక్రమంలో భాగంగా, ఐటీసీ ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవుల పునరుద్ధరణ, సముద్ర తాబేలు పిల్లల సంరక్షణకు సంబంధించి ఒక విశిష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్థానిక కమ్యూనిటీల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణలో సాధించగల అద్భుతమైన మార్పును ఇది స్పష్టం చేస్తోంది.
 
తుఫాన్లు, సముద్ర మట్టాలు పెరగడం, ఉప్పునీరు చొరబడటం, తీరప్రాంత వరదలు వంటి వాతావరణ మార్పుల పరిణామాలకు భారతదేశ తీరప్రాంత పర్యావరణ వ్యవస్థలు తీవ్రంగా గురవుతున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో తీరప్రాంతానికి ఒక సహజ కవచంగా మడ అడవులు పనిచేస్తాయి. పర్యావరణానికి ఇవి అత్యంత ప్రభావవంతమైన సహజసిద్ధ పరిష్కారంగా నిలుస్తాయి. బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్స్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మడ అడవులు, ఉష్ణమండల అడవుల కంటే ఎకరాకు దాదాపు 7.5 నుంచి 10 రెట్లు ఎక్కువ కార్బన్‌ను నిల్వ చేస్తాయి. అందువల్ల వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో ఇవి కీలకంగా మారాయి. భారతదేశంలోని మడ అడవులు జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లుగా ఉంటూ.. 920 వృక్ష జాతులు, 3,090 జంతు జాతులతో సహా 4,000 కు పైగా ప్రాణులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి.
 
2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన ఐటీసీ మడ అడవుల సంరక్షణ కార్యక్రమం.. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన తీరప్రాంత వ్యవస్థలను రక్షించడంపై ప్రధానంగా దృష్టి సారించింది. అదే సమయంలో ఆ ప్రాంత పర్యావరణ సమతుల్యతపై ఆధారపడి జీవిస్తున్న స్థానిక మత్స్యకార వర్గాల జీవనోపాధికి కూడా అండగా నిలుస్తోంది. 
 
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, జిల్లా యంత్రాంగం, అమలు భాగస్వామి అయిన ట్రీ ఫౌండేషన్ సహకారంతో, దీర్ఘకాలిక పర్యావరణ పునరుద్ధరణ కోసం కమ్యూనిటీల భాగస్వామ్యంతో కూడిన శాస్త్రీయ విధానాన్ని ఐటీసీ అవలంబించింది. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి, దాదాపు 1,500 ఎకరాల మడ అడవులను పునరుద్ధరించి, సంరక్షించడం జరిగింది.
 
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయుసిఎన్) ద్వారా ముప్పు పొంచి ఉన్న జాతిగా వర్గీకరించబడిన ఆలివ్ రిడ్లే సముద్ర తాబేళ్ల రక్షణపై కూడా ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆలివ్ రిడ్లే సముద్ర తాబేళ్ల సంరక్షణ అనేది మడ అడవుల సంరక్షణతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఎందుకంటే, ఆరోగ్యకరమైన మడ అడవుల పర్యావరణ వ్యవస్థ వాటి గూళ్లు కట్టుకోవడానికి, మనుగడకు అవసరమైన కీలక ఆవాసాలను అందిస్తుంది. ఆలివ్ రిడ్లే తాబేళ్లు ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న సముద్ర తాబేలు జాతులు. ఇవి సామూహికంగా గుడ్లు పెట్టే ప్రత్యేక లక్షణానికి ప్రసిద్ధి చెందాయి. 
 
ఈ ఆవాసాలను రక్షించడం కేవలం తాబేళ్లకు మాత్రమే కాకుండా, మొత్తం సముద్ర ఆహార జాలానికి మేలు చేస్తుంది. తాబేళ్ల సంరక్షణ కార్యక్రమం ద్వారా బలపడే ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు.. చేపల వృద్ధిని మెరుగుపరిచి, తీరప్రాంత కమ్యూనిటీలకు దీర్ఘకాలిక ఉపాధి భద్రతను అందిస్తాయి.
 
తాబేళ్లు గుడ్లు పెట్టే కాలంలో రక్షణను మెరుగుపరచడానికి, అటవీ శాఖ క్రియాశీల మద్దతుతో ముప్పు పొంచి ఉన్న తీరప్రాంతాల్లో ఆరు పొదిగే కేంద్రాలను ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన స్థానిక యువత, మత్స్యకారులతో కూడిన కమ్యూనిటీ-ఆధారిత సీ టర్టిల్ ప్రొటెక్షన్ ఫోర్సెస్.. బీచ్‌లలో పెట్రోలింగ్ చేయడం, గుడ్లు పెట్టే కార్యకలాపాలను పర్యవేక్షించడం, పొదిగే కేంద్రాలను నిర్వహించడంలో చురుకుగా పాల్గొంటున్నాయి. ఈ ప్రయత్నాలు తాబేలు పిల్లల మనుగడ రేటును గణనీయంగా మెరుగుపరిచాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి, 250 కి పైగా ఆలివ్ రిడ్లే గూళ్లను సంరక్షించారు. ఫలితంగా 23,700 కి పైగా తాబేలు పిల్లలను విజయవంతంగా సముద్రంలోకి విడిచిపెట్టగలిగారు.
 
అంతేకాకుండా, 2004 సునామీ సృష్టించిన విధ్వంసాన్ని కళ్లారా చూసిన ఏపీలోని బాపట్ల జిల్లా ఏటిమొగ వంటి గ్రామాల్లో.. మడ అడవుల పునరుద్ధరణపై స్థానికుల్లో అవగాహన పెరుగుతోంది. వాతావరణ సంబంధిత విపత్తుల నుంచి ప్రాణాలు, జీవనోపాధి మరియు తీరప్రాంతాలను రక్షించడంలో సహజ పర్యావరణ వ్యవస్థల పాత్రను ఇది మరింత బలోపేతం చేస్తోంది.
 
ఈ సందర్భంగా ఐటీసీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్-సోషల్ ఇన్వెస్ట్‌మెంట్స్ శ్రీ ప్రభాకర్ లింగారెడ్డి మాట్లాడుతూ.. బలమైన స్థానిక చర్యలు, కమ్యూనిటీల విశేష భాగస్వామ్యం ద్వారా మాత్రమే ప్రపంచ పర్యావరణ లక్ష్యాలను సాధించగలమన్న మా నమ్మకాన్ని ఈ ఏడాది అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవ ఇతివృత్తం మరింత బలపరుస్తోంది. స్థానిక కమ్యూనిటీలు, ప్రభుత్వ సంస్థలు, భాగస్వాములతో కలిసి పనిచేయడం ద్వారా అత్యుత్తమ పర్యావరణ పరిష్కారాలను రూపొందించడమే మా లక్ష్యం. ఇది ముప్పు పొంచి ఉన్న పర్యావరణ వ్యవస్థలను రక్షించడమే కాకుండా, పర్యావరణ సమతుల్యతపై ఆధారపడిన లక్షలాది మంది ప్రజలకు సుస్థిర భవిష్యత్తును అందిస్తుంది అని అన్నారు.
 
ఐటీసీ జీవవైవిధ్య వ్యూహంలో గ్రామీణ ఉమ్మడి వనరుల భారీ పునరుద్ధరణ మరియు అగ్రిస్కేప్‌ల అభివృద్ధి(వ్యవసాయానికి మద్దతునిచ్చే కీలకమైన సహజ పర్యావరణ వ్యవస్థను సంరక్షించడం, మెరుగుపరచడం)కూడా ఉన్నాయి. స్థానిక పాలన, జీవనోపాధి మద్దతుతో పర్యావరణ పునరుద్ధరణను మేళవించే కమ్యూనిటీ ఆధారిత, శాస్త్రీయ విధానం ద్వారా దీనిని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో, ముఖ్యంగా రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లలో దాదాపు 40,000 మంది కమ్యూనిటీ సభ్యులతో కూడిన 8,000కు పైగా గ్రామస్థాయి సంస్థల ద్వారా ఉమ్మడి సహజ వనరుల పునరుత్పత్తి, సమిష్టి నిర్వహణకు ఐటీసీ ఉమ్మడి వనరుల పునరుద్ధరణ కార్యక్రమం ఎంతగానో తోడ్పడింది.
 
భౌగోళిక సమాచార వ్యవస్థ ఆధారిత ప్రణాళిక, నేల, తేమ సంరక్షణ, దేశీయ వృక్షాల పెంపకం, జీవవైవిధ్య అభివృద్ధి చర్యల ద్వారా క్షీణించిన పచ్చిక బయళ్లు, గ్రామ అడవులు, జల వనరులను పునరుద్ధరించడంపై ఐటీసీ ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా ఈ పునరుద్ధరణ చర్యలను స్థానిక కమ్యూనిటీలు, ప్రభుత్వ విభాగాలు, ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ(ఎఫ్ఇఎస్), బిఎఐఎఫ్, మైరాడ, ధన్ ఫౌండేషన్ లాంటి అభివృద్ధి సంస్థల బలమైన భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు.
 
సహజ వనరుల పరిరక్షణ పట్ల ఐటీసీకి దీర్ఘకాలిక నిబద్ధత ఉంది. 2025లో చేపట్టిన ఒక వినూత్న చర్య ద్వారా, టాస్క్‌ఫోర్స్ ఆన్ నేచర్-రిలేటెడ్ ఫైనాన్షియల్ డిస్‌క్లోజర్స్(టీఎన్‌ఎఫ్‌డీ)కి అనుగుణంగా సమగ్రమైన నేచర్ రిపోర్ట్‌ను విడుదల చేసిన మొట్టమొదటి భారతీయ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఒకటిగా ఐటీసీ నిలిచింది. టీఎన్‌ఎఫ్‌డీ అనేది ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం, యూఎన్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ ఫైనాన్స్ ఇనిషియేటివ్, గ్లోబల్ కానోపీ, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్‌తో కూడిన సంస్థల కూటమి. పర్యావరణానికి సంబంధించిన ఆధారితాలు, ప్రభావాలు, ప్రమాదాలు, అవకాశాలను నివేదించడానికి సంస్థలకు సమగ్రమైన మార్గదర్శకాలను అందించే మార్కెట్-ఆధారిత, శాస్త్రీయ, ప్రభుత్వ మద్దతు ఉన్న గ్లోబల్ చొరవ ఇది.
About Writer
ఐవీఆర్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
హోటల్ లాయల్టీని సరికొత్తగా మారుస్తున్న ప్రయాణ అభిరుచులు: మారియట్ బాన్‌వాయ్ నివేదిక