చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన కాకులను తాకొద్దంటూ హెచ్చరిక
చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. దీంతో వందలాది కాకులు చనిపోతున్నాయి. ఇలా చనిపోయిన కాకులు రోడ్లు, వీధుల్లో పడుతున్నాయి. వీటిని తాకొద్దంటూ చెన్నై కార్పొరేషన్ అధికారులు చెన్నై వాసులను హెచ్చరిస్తున్నారు. మరణించిన కాకుల్లో ఏవియన్ ఇన్ ఫ్లుయెంజా వైరస్ ఉన్నట్టు ప్రయోగశాలలు నిర్ధారించాయి. అలాగే, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్రం అప్రమత్తం చేసింది. ఇప్పటికే కేరళ, బీహార్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైవున్నాయని పేర్కొంది.
చెన్నై నగరంలో ఇటీవలికాలంలో అడయార్, గాంధీ నగర్, పళ్లికరణి, వేలచ్చేరి, ఈస్ట్ కోస్ట్ రోడ్, పాత మహాబలిపురం రోడ్డు తదితర ప్రాంతాల్లో కాకులు విపరీతంగా చనిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న కాంచీపురం జిల్లా యానిమల్ డిసీజ్ ఇన్వెస్టిగేషన్ బృందం గత నెలలో చనిపోయిన కాకుల నుంచి శాంపిల్స్ సేకరించి భోపాల్ నగరంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ డిసీజ్ కంట్రోల్‌కు పంపించింది. పరీక్షల అనంతరం కాకుల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమని నివేదికలు స్పష్టం చేశాయి.
ఈ వైరస్ ఇతర జంతువులకు, అరుదుగా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉండటంతో కేంద్ర పశువైద్య పరిశోధనా సంస్థ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. నిఘాను మరింతగా పెంచాలని సూచించింది. ఎక్కడైనా పక్షులు చనిపోయి కనిపిస్తే వెంటనే అధికారులకు తెలిపాలని కోరింది.
చనిపోయిన పక్షులను నేరుగా చేతులతో తాకవద్దని, వాటి కళేబరాలను కనీసం 8 అడుగుల లోతైన గొయ్యి తీసి పూడ్చివేయాలని హెచ్చరించింది. అదేసమయంలో ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని, భద్రతా మార్గదర్శకాలను పాటిస్తే సరిపోతుందని కేంద్ర పశువైద్య పరిశోధనా సంస్థ తెలిపింది.