గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 11 జూన్ 2016 (21:12 IST)

రాజ్యసభ ఎన్నికలు : రాజస్థాన్ నుంచి వెంకయ్య.. కర్ణాటక నుంచి నిర్మలా.. తుది ఫలితాలివే

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల తుది ఫలితాలు శనివారం వెలువడ్డాయి. దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 27 రాజ్యసభ స్థానాలకు ఈరోజు పోలింగ్‌ నిర్వహించారు. ఉదయం 9 తొమ్మిది గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. మొత్తం 57 సీట్లకుగాను 30 సీట్లకు పోటీ లేకుండానే అభ్యర్థులు ఎన్నిక కాగా, మిగిలిన 27 సీట్లకు శనివారం ఎన్నికలు జరిగాయి. ఇందులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 11, హర్యానాలో 2, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్‌లో 3, రాజస్థాన్‌లో 4, జార్ఖండ్‌లో 2, ఉత్తరాఖండ్‌లో ఒక సీటుకు ఈ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాజస్థాన్‌లోని నాలుగు స్థానాల్లో భాజపా విజయం సాధించింది. వీరిలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహా.. భాజపా అభ్యర్థులు గెలుపొందారు. కర్ణాటకలోని నాలుగు సీట్లకు గానూ మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపొందగా ఒకస్థానాన్ని భాజపా కైవసం చేసుకుంది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ భాజపా తరపున విజయం సాధించారు. ఇక కాంగ్రెస్‌ నుంచి జైరామ్‌ రమేశ్‌, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, కేసీ రామ్మూర్తి గెలుపొందారు.
 
అదేవిధంగా ఉత్తరాఖండ్‌లో ఒక స్థానానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్‌ నేత ప్రదీప్‌ టంటా విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లో మూడు స్థానాలకు గానూ రెండింటిలో భాజపా గెలుపొందింది. భాజపా నుంచి ఎంజే అక్బర్‌, అనిల్‌ మాధవ్‌ దావే విజయం సాధించారు. మరో స్థానంలో కాంగ్రెస్‌ మద్దతుతో వివేక్‌ టంకా గెలుపొందారు. జార్ఖండ్‌లో రెండు స్థానాల్లో భాజపా జయకేతనం ఎగురవేసింది. కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, మహేశ్‌ పొడ్డార్‌ రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకున్నారు. 
 
హర్యానాలోని రెండు స్థానాలకు గానూ ఒక స్థానంలో భాజపా తరపున కేంద్రమంత్రి బీరేందర్‌ సింగ్‌ విజయం సాధించగా మరో చోట భాజపా మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి సుభాష్‌ చంద్ర గెలుపొందారు. ఉత్తరప్రదేశ్‌లో 11 స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ 7, బీఎస్పీ 2, భాజపా, కాంగ్రెస్‌ ఒకటి చొప్పున సీట్లు దక్కించుకున్నాయి. కాంగ్రెస్‌ నుంచి కపిల్‌సిబల్‌ గెలుపొందారు.