శుక్రవారం, 6 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 జనవరి 2026 (14:24 IST)

బీజేపీ జాతీయ కొత్త అధ్యక్షుడు ఎవరు? 20న ఎంపిక

bjp flag
ఈ నెల 20వ తేదీన భారతీయ జనతా పార్టీ జాతీయ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ నెల 19వ తేదీన వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం కొత్త అధ్యక్షుడు కోసం ఎన్నిక తేదీని బీజేపీ శుక్రవారం ప్రకటించింది. 19వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉందని, ఆ మరుసటి రోజు జనవరి 20న కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
 
ఈ మేరకు భాజపా రిటర్నింగ్‌ అధికారి కె.లక్ష్మణ్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 19వ తేదీ మధ్యాహ్నం 2-4 గంటల మధ్య అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించవచ్చని లక్ష్మణ్‌ తెలిపారు. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన చేపడతామన్నారు. 
 
అదేరోజు సాయంత్రం 5 - 6 గంటల మధ్య నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నిక అవసరమైతే జనవరి 20న పోలింగ్‌ నిర్వహించి విజేతను ప్రకటిస్తామన్నారు. ఈ ప్రక్రియంతా బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది.
 
కాగా, ఇటీవల కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన 45 ఏళ్ల నితిన్‌ నబీన్‌నే పార్టీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. యువనాయకత్వాన్ని తయారుచేసుకోవడడంలో భాగంగా నబీన్‌కు పార్టీ సారథ్య పగ్గాలు అప్పగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.