బీజేపీ జాతీయ కొత్త అధ్యక్షుడుగా నితిన్ నబిన్ ఏకగ్రీవం.. 20న ప్రమాణం
భారతీయ జనతా పార్టీ జాతీయ నూతన అధ్యక్షుడుగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితిన్ నబిన్ ప్రస్తుతం ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఉన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో నితిన్ నబిన్‌ను ఎన్నుకున్నారు.
బీహార్ రాష్ట్రానికి చెందిన నితిన్ నబిన్‌ను బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గత యేడాది డిసెంబరు నెలలో ప్రకటించిన విషయం తెల్సిందే. నితిన్‌నే జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకోవాలన్న కృతనిశ్చయంతోనే మోడీ - షా ద్వయం ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేశారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో కలిగిన నితిన్ నబిన్... బీహార్ అసెంబ్లీలో బాంకీపూర్ నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా, ఈ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కె.లక్ష్మణ్ వ్యవహరించిన విషయం తెల్సిందే.