వెస్ట్ బెంగాల్‌లో అధికారంలోకి వస్తాం : నితిన్ నబిన్
పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వస్తామని భారతయ జనతా పార్టీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ జోస్యం చెప్పారు. ఆదివారం నియమితులైన ఆయన...ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'కేంద్ర నాయకత్వం మాపై ఉంచిన నమ్మకంతో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తాను' అని నితిన్ నబిన్ తెలిపారు.
అలాగే, వచ్చే ఏడాది జరగనున్న బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావించగా, బెంగాల్లోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 'మా సంస్థాగత నిర్మాణం కింది నుంచి పై వరకు చాలా బలంగా ఉంది. అందుకే బెంగాల్లో కూడా మేం గెలుస్తాం' అని పేర్కొన్నారు.
నితిన్ నబిన్ నియామకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాగతించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఆయనకు అభినందనలు తెలిపారు. 'నితిన్ శక్తిసామర్థ్యాలు, అంకితభావం రానున్నకాలంలో మన పార్టీని మరింత బలోపేతం చేస్తాయని విశ్వసిస్తున్నాను' అని మోడీ పేర్కొన్నారు.
కాగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నితిన్ నబిన్‌కు బీహార్ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన అనుభవం ఉంది. పలు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీలో తరం మార్పునకు ఇది ఒక సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.