శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 21 జులై 2014 (17:38 IST)

పెళ్లితో తిరిగి ఒక్కటయ్యారు: కానీ వెంటాడుతున్న రేప్ కేసు!

ఓ ప్రేమ జంట విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకుంది. అత్యాచారం జరిపాడంటూ పెళ్లికి ముందు యువతి వేసిన కేసుపై విచారణ జరుగుతుండగా తిరిగి వారిద్దరు ఒక్కటయ్యారు. అయితే, కేసును మాఫీ చేసుకునే విషయంపై వారికి చిక్కులు ఎదురవుతున్నాయి. పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఓ యువకుడి మాటలకు ఓ యువతి తన సర్వస్వాన్ని అర్పించింది. చివరకు పెళ్లి కథ అడ్డం తిరగడంతో అతనిపై రేప్ కేసు పెట్టింది. తాజాగా వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... 
 
ముంబైలోని బోరివ్వీ ప్రాంతంలో ఇరుగుపొరుగు ఇళ్లలో నివశించే గుజరాతీ యువతీ - ముంబై యువకుడు ఆరేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని అమ్మాయిని ముగ్గులోకి దింపాడు. అతడి మాటలు నమ్మి సర్వస్వాన్ని అర్పించింది. ఈ యువ ప్రేమికులు 2012లో హద్దులు దాటారు. తర్వాత ఆమెను ప్రియుడు పట్టించుకోకపోవడంతో ఈ ఏడాది మే 5వ తేదీన పోలీసులను ఆశ్రయించింది. 
 
ఇది జరిగిన వారం తర్వాత వారిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. అయితే, పెళ్లికి ముందు పెట్టిన రేప్ కేసు వారిని వెంటాడుతోంది. దాన్ని నుంచి తప్పించుకునేందుకు ఈ జంట మరో న్యాయపోరాటం చేస్తోందీ ఈ దంపతుల జంట. 
 
ప్రియుడిపై మోపిన రేప్ అభియోగం తొలగించాలని ఆమె స్థానిక న్యాయస్థానాన్ని కోరగా అదంత సులభమైన విషయం కాదని తేలింది. తామిద్దరం పరస్పర ఆమోదంతోనే లైంగిక చర్యలో పాల్గొన్నామని తమ న్యాయవాది ద్వారా కోర్టులో వాదనలు వినిపించినా రేప్ కేసు నుంచి విముక్తి లభించలేదు. దీంతో కేసు హైకోర్టుకు వెళ్లింది. 
 
బాధితులు, నిందితులు రాజీ పడితే రేప్ కేసును మూసేయొచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రియుడి తరపు లాయర్ ఉటంకించారు. అయితే వీరి వివాహాన్ని వారి తల్లిదండ్రులు ఆమోదిస్తే సమస్యను పరిష్కరిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేశారు. ఈ రేప్ ప్రేమకథ ముగింపు ఎలా ఉంటుంటో వేచి చూద్దాం.