ఆ వెబ్‌సైట్లపై కేంద్రం కొరఢా - 242 వెబ్‌సైట్స్ బ్లాక్
ఆన్‌లైన్ గేమింగ్, రియల్ మనీ గేమ్స్‌పై కేంద్రం మరోమారు కొరఢా ఝళిపించింది. ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట కింద బెట్టింగ్, జూదం వంటి వాటితో సంబంధం ఉన్న 242 వెబ్ సైట్లను బ్లాక్ చేసింది. ఇప్పటికే దేశంలో జూదం, బెట్టింగ్ వంటి ఆన్ లైన్ గేమ్స్‌ను ప్రమోట్ చేస్తున్న దాదాపు 8 వేల వెబ్‌సైట్స్‌పై కేంద్రం చర్యలు చేపట్టిన విషయం తెల్సిందే. తాజాగా రియల్ మనీ గేమింగ్ యాప్‌లను కూడా నిషేధించింది.
బెట్టింగ్, ఆన్‌లైన్ జూదం కారణంగా యువత పెడదోవ పట్టడం, ఆర్థికంగా చితికిపోతున్నట్లు గ్రహించిన కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. గతేడాది అక్టోబరు నెలలో ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్, 2025ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే నగదుతో ముడిపడిన ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించింది. దీంతో వింజో, నజారా టెక్నాలజీస్ వంటి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్ రియల్ మనీ గేమ్స్‌కు స్వస్తి చెప్పాయి.
బీజేపీ జాతీయ కొత్త అధ్యక్షుడు ఎవరు? 20న ఎంపిక
ఈ నెల 20వ తేదీన భారతీయ జనతా పార్టీ జాతీయ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ నెల 19వ తేదీన వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం కొత్త అధ్యక్షుడు కోసం ఎన్నిక తేదీని బీజేపీ శుక్రవారం ప్రకటించింది. 19వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉందని, ఆ మరుసటి రోజు జనవరి 20న కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు భాజపా రిటర్నింగ్ అధికారి కె.లక్ష్మణ్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 19వ తేదీ మధ్యాహ్నం 2-4 గంటల మధ్య అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించవచ్చని లక్ష్మణ్ తెలిపారు. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన చేపడతామన్నారు.
అదేరోజు సాయంత్రం 5 - 6 గంటల మధ్య నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నిక అవసరమైతే జనవరి 20న పోలింగ్ నిర్వహించి విజేతను ప్రకటిస్తామన్నారు. ఈ ప్రక్రియంతా బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది.
కాగా, ఇటీవల కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన 45 ఏళ్ల నితిన్ నబీన్‌నే పార్టీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. యువనాయకత్వాన్ని తయారుచేసుకోవడడంలో భాగంగా నబీన్‌కు పార్టీ సారథ్య పగ్గాలు అప్పగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.