1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Chennai auto driver beats DMK and AIADMK heavyweights, wins Royapuram for TVK

తమిళనాడు ఎన్నికల్లో ఆటో డ్రైవర్ చేతిలో మాజీ మంత్రికి డిపాజిట్ గల్లంతు

auto driver damu
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థిగా పోటీ చేసిన ఆటో డ్రైవర్ విజయ్ దాము పోటీ చేసి విజయభేరీ మోగించారు. చెన్నై రాయపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన అన్నాడీఎంకే మాజీ మంత్రి డి.జయకుమార్‌కు డిపాజిట్ గల్లంతయ్యేలా ఓడించారు. తన సమీప డీఎంకే అభ్యర్థి మాజీ మంత్రి రెహ్మాన్ ఖాన్ తనయుడు సుబైర్ ఖాన్‌పై 14249 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
 
విజయ్‌ దాదాపుగా సామాన్యులకే సీట్లు కేటాయించడం ద్వారా తనదైన మార్కు చూపించారు. రాజకీయ వారసత్వానికి భిన్నంగా ఆయన క్షేత్రస్థాయి కార్యకర్తలకే సీట్లు ఇచ్చి ప్రత్యేకతను చాటారు. తన వద్ద దాదాపు 30 ఏళ్లుగా కారు డ్రైవర్‌గా పనిచేసి, ప్రస్తుతం సహాయకుడిగా కొనసాగుతున్న రాజేంద్రన్‌ కుమారుడు శబరినాథన్‌ను చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి విజయ్‌ బరిలో దించగా డీఎంకే అభ్యర్థిపై ఆధిక్యంతో స్పష్టమైన విజయం దిశగా దూసుకెళ్తుండటం విశేషం.
 
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : విజయ్ పోటీ చేసిన రెండో చోట్లా విజయమే... 
 
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ పోటీ చేసిన రెండు చోట్లా గెలుపొందారు. తద్వారా తమిళ రాజకీయాల్లో అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసి చూపించారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన కేవలం రెండేళ్ల రెండు మాసాల వ్యవధిలోనే చరిత్ర లిఖించారు. టీవీకే ఏర్పాటైన తర్వాత తొలిసారి జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతో విజిల్‌ వేయించి మెజార్టీ స్థానాలు గెలిచి అటు సినిమాల్లోనే కాదు.. ఇటు పాలిటిక్స్‌లోనూ సూపర్‌ హిట్‌ కొట్టారు. 
 
ఈ ఎన్నికల్లో ఆయన చెన్నై జిల్లాలోని పెరంబూర్, తిరుచ్చి జిల్లాలోని తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గాల నుంచి బరిలో దిగిన జోసెఫ్‌ విజయ్‌ చంద్రశేఖర్‌.. తన ప్రత్యర్థులను చిత్తుగా ఓడించారు. పెరంబూర్‌లో డీఎంకే అభ్యర్థి ఆర్డీ శేఖర్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించగా తిరుచ్చి ఈస్ట్‌లోనూ అదే పార్టీ అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్‌పై గెలుపొంది సత్తా చాటారు.
 
కొన్ని ఎగ్జిట్‌పోల్స్‌, కొందరు రాజకీయ విశ్లేషకులు ఈ ఎన్నికల్లో విజయ్‌ ప్రభావం అంతగా ఏమీ ఉండకపోవచ్చని.. ఆయన ఓట్లు చీలుస్తారని, ఒకవేళ హంగ్‌ వస్తే ఆయన కింగ్‌మేకర్‌ అవుతారంటూ రకరకాల అంచనాలు వెలువరించారు. కానీ, వాటన్నింటినీ తారుమారు చేస్తూ అనూహ్యంగా టీవీకే అత్యధికంగా 110 స్థానాలు గెలుచుకోవడంతో ఆయన కింగ్‌గా అవతరించడం ఇప్పుడు దేశమంతా హాట్‌టాపిక్‌ అయింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఎన్టీఆర్ తర్వాత దళపతి విజయ్.. భీమవరంలో బెట్టింగ్‌లు.. భారీ డబ్బు గోవిందా!