భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు
చెన్నై మెట్రో రైలు భూగర్భంలో చిక్కకునిపోయింది. మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ రైలు సొరంగంలో ఆగిపోయింది. దీనికితోటు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులను మార్గమధ్యంలో దించేశారు. ఆ తర్వాత వారంతా సొరంగం మార్గంలో మరో స్టేషన్ వరకు నడిచి వచ్చారు. చెన్నై ఎయిర్ పోర్టు - విమ్కో నగర్ ప్రాంతాల మధ్య నడిచే మెట్రో రైలు చెన్నై సెంట్రల్ స్టేషన్ దాటిన తర్వాత రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనికితోడు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వారు మధ్యలోనే ఆగి సొరంగంలోని రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ హైకోర్టు మెట్రో సేషన్‌కు చేరుకున్నారు.
ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. ఈ విషయం తెలుసుకున్న చెన్నై మెట్రో రైలు ఓ ప్రకటన విడుదల చేసింది. మెట్రో రైలులో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ, క్షమాపణలు కోరింది. ఆ తర్వాత ఇంజనీర్లు స్పందించి, బ్లూ లైన్ మార్గంలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత రైలు సేవలు యధావిధిగా ప్రారంభమయ్యాయి.