ఆదివారం, 2 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2025 (17:41 IST)

రాష్ట్ర ప్రధాన కార్యదర్శులపై సుప్రీం ఆగ్రహం.. 3న రావాలంటూ ఆదేశం

Stray dogs
వీధి కుక్కల నియంత్రణ కేసులో పలు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల (సీఎస్‌లు) తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పాటించని ప్రధాన కార్యదర్శులతా నవంబరు 3వ తేదీన జరిగే విచారణకు భౌతికంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతించాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది.
 
ఈ కేసుకు సంబంధించి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా శుక్రవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. సదరు సీఎస్‌లను వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 
 
'కంప్లయన్స్ అఫిడవిట్ దాఖలు చేయమని మేము ఆదేశిస్తే, వాళ్లు నిద్రపోతున్నారు. కోర్టు ఆదేశాల పట్ల ఏమాత్రం గౌరవం లేదు. సరే, అయితే వాళ్లనే రానివ్వండి' అని జస్టిస్ విక్రమ్ నాథ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
 
వీధి కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఆగస్టు 22న ఇచ్చిన ఆదేశాల మేరకు కంప్లయన్స్ అఫిడవిట్లు దాఖలు చేయనందున, పశ్చిమ బెంగాల్, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల సీఎస్‌లు నవంబరు 3న తమ ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు అక్టోబరు 27న ఆదేశించిన విషయం తెలిసిందే.
 
ఆగస్టు 22వ తేదీన సుప్రీంకోర్టు ఈ కేసు పరిధిని ఢిల్లీ-ఎన్సీఆర్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించింది. జంతు జనన నియంత్రణ (ఏబీసీ) నిబంధనల అమలుకు అవసరమైన వనరుల (డాగ్ పౌండ్స్, పశువైద్యులు, కుక్కలను పట్టే సిబ్బంది, వాహనాలు, బోనులు) పూర్తి గణాంకాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మున్సిపల్ అధికారులను ఆదేశించింది. 
 
ఏబీసీ నిబంధనలు దేశమంతటా ఒకేలా వర్తిస్తాయని పేర్కొంటూ రాష్ట్రాలను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చింది. ఢిల్లీలో వీధి కుక్కల కాటు వల్ల చిన్నారులు రేబిస్ బారిన పడుతున్నారంటూ వచ్చిన మీడియా కథనాల ఆధారంగా సుప్రీంకోర్టు జూలై 28న ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతోంది.