కాక్రోచ్ జనతా పార్టీకి విశేష స్పందన... ఇన్‌స్టాలో 66 లక్షల పైగా ఫాలోవర్లు
సోషల్ మీడియా ఎపుడూ ఏది ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టసాధ్యంగా మారింది. తాజాగా కాక్రోచ్ జనతా పార్టీ అనే సెటైరికల్ వెబ్‌సైట్ ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన ఈ వెబ్‌సైట్‌కు సంబధించిన ఇన్‌స్టా పేజీ కొన్ని రోజుల్లోనే ఏకంగా 66 లక్షల మందికిపై ఫోలోయర్లు వచ్చేశారు.
అభిజిత్ డిప్కే అనే వ్యక్తి ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఆయన తనను తాను కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడుగా అభివర్ణించుకున్నారు. యువత చేత, యువత కొరకు, యువత యొక్క రాజకీయ వేదిక అనేది ఈ పార్టీ నినాదంగా ఇన్‌స్టా, ఎక్స్ ఖాతాల్లో పేర్కొన్నారు. ఇదంతా కేవలం వ్యంగ్యం మాత్రమేనని, వెబ్‌సైట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. పార్టీలో చేరాలనుకునే వారి కోసం ఒక ఫారమ్ కూడా అందుబాటులో ఉంచడం గమనార్హం.
ప్రస్తుతం ఈ పేజీలో సుమారు 50 వరకు ఫోటోలు, వీడియోలు రీల్స్ ఉన్నాయి. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలతో పోలిస్తే ఈ సెటైరికల్ పేజీ ఫాలోయర్ల సంఖ్య ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇన్‌స్టాలో ఆమ్ ఆద్మీ పార్టీకి 1.9 మిలియన్లు, బీజేపీకి 8.7 మిలియన్లు, కాంగ్రెస్ పార్టీకి 13.3 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ సెటైరికల్ పేజీకి ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో ఆదరణ లభించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
