శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2015 (11:40 IST)

"బహు భార్యత్వం" అనే పదాన్ని ముస్లిం పురుషులు అపార్థం చేసుకున్నారు!

ఖురాన్‌లోని "బహు భార్యత్వం" అన్న పదాన్ని అడ్డం పెట్టుకుని కొందరు ముస్లింలు స్వీయ ప్రయోజనాల కోసం పబ్బం గడుపుకుంటున్నారని గుజరాత్ హైకోర్టు సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఐపీసీ సెక్షన్ 494 (ఒకరి కన్నా ఎక్కువ భార్యలుంటే వేయాల్సిన శిక్షల గురించి చర్చించే సెక్షన్)పై జరిగిన వాదనల అనంతరం జస్టిస్ దేబీ పార్దీవాలా ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
దేశమంతా ఒకే చట్టం అమలు కావాల్సి వుందని పార్ధీవాలా అభిప్రాయపడ్డారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ఓ భార్యను హింసకు గురిచేయమని చెప్పట్లేదని.. ఆమెను ఇంటి నుంచి పంపేసి.. ఇంకొకరి వివాహం చేసుకోవాలని ఏ చట్టమూ చెప్పలేదని పార్దీవాలా అన్నారు.
 
ముస్లిం పురుషులు ఖురాన్ వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారన్నారు. తన భర్త మరో పెళ్లి చేసుకోవడంపై జాఫర్ అబ్బాస్ అనే వ్యక్తి మొదటి భార్య పోలీసు కేసు పెట్టగా, అది విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా జాఫర్, ఖురాన్‌ను ప్రస్తావించాడు. ముస్లిం పర్సనల్ లా తనకు ఆ హక్కును ఇచ్చిందని, తనకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ దాఖలైందని, దాన్ని రద్దు చేయాలని వాదించాడు. ఈ సందర్భంగా న్యాయమూర్తిపై వ్యాఖ్యలు చేశారు. 
 
"ఖురాన్‌లో బహు భార్యత్వానికి అనుమతించడం వెనుక సరైన కారణాలున్నాయి. కానీ నేటి తరంలో దాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారు. ఖురాన్‌‌లో సైతం బహు భార్యత్వంపై ఒక్క చోటే ప్రస్తావన ఉంది. అది కూడా కొన్ని నిబంధనలు, పరిమితుల మేరకు మాత్రమే" అని పార్దీవాలా గుర్తు చేశారు.