ఈరోజుల్లో మద్యం తాగడం అంతా కామన్ నాన్నా, కుమార్తె మాటలకు తండ్రి గుండె బద్ధలైంది
ఆధునిక లైఫ్ స్టైల్ ఎలా వుంటుందో వేరే చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కొందరు, వికృత చేష్టలతో మరికొందరు, సిగరెట్లు తాగుతూ ఇంకొందరు, ఏకంగా ప్రధానమంత్రినే దుర్భాషలాడుతూ అదే గొప్పనుకునే యువతీయువకులు... ఇలా చెప్పుకుంటే పోతే యువతలో కొంతమంది ఏ దారిని పోతున్నారో వారికే తెలియడంలేదు. గౌహతికి చెందిన ఓ తండ్రి ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.
గౌహతికి చెందిన ఒక యువతి వైద్య విద్య కోసం హాస్టల్‌లో ఉంటూ చదువుకునేది. ఆమె తన సోదరుడి పెళ్లి కోసం ఇంటికి తిరిగి వచ్చింది. పెళ్లి తంతులో భాగంగా పెళ్లి పనులు చేస్తున్న కొంతమంది కార్మికులు మద్యం తాగుతూ ఉండటాన్ని ఆమె చూసింది. అప్పటికే తోటి స్నేహితురాళ్లతో నగరంలో తాగడం అలవాటు చేసుకున్న ఆమె, కార్మికులు తాగుతున్న మద్యం చూసి వారితో కలిసి తను కూడా తాగాలని పట్టుబట్టింది. వారు వద్దన్నా, ఆమె మద్యం కావాలని అడుగుతూనే ఉంది, డబ్బులు కూడా ఇస్తానని చెప్పింది.
దాంతో చేసేదేమి లేక వారు మద్యం బాటిల్ ఆమెకి ఇచ్చేసారు. ఆమె బాగా తాగి హంగామా చేయడం మొదలుపెట్టింది. ఆమె అరుపులు విని, వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. ఆమె తండ్రి ఆశ్చర్యపోయి, కోపంతో రగిలిపోయాడు. నిన్ను చదువుకుని భవిష్యత్తును నిర్మించుకోవడానికి పంపించాం, వ్యసనపరురాలిగా మారడానికి కాదు అన్నాడు ఆయన. ఆమె తల్లి ఆయన్ని ఆపి, తన కూతురిని లోపలికి తీసుకువెళ్ళింది.
ఆ అమ్మాయి, నాన్నా, నా స్నేహితులందరూ తాగుతారు. అందులో తప్పేముంది? అని బదులిచ్చింది. ఈ రోజుల్లో ఇదంతా కామన్ అనేసరికి ఆమె తండ్రి గుండె పగిలిపోయి, నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. తన కూతురు డాక్టర్ అవ్వాలనే కలలతో ఆయన ఆమెను పంపించాడు. స్వేచ్ఛ విలువైనదే, కానీ బాధ్యత లేకుండా, అది కొన్నిసార్లు తల్లిదండ్రులు కలలు కనే భవిష్యత్తునే నాశనం చేయగలదని ఈ ఘటన నిరూపిస్తోంది.
