ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా : తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్
దేశంలో నాలుగు రాష్ట్రాలతోపాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు (234), పశ్చిమ బెంగాల్ (294), కేరళ (140), అస్సాం (126)తోపాటు పుదుచ్చేరి (30) రాష్ట్రాల్లో మొత్తంగా 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ వివరాలను వెల్లడించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది.
పుదుచ్చేరితోపాటు నాలుగు రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే, జూన్‌లలో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. క్షేత్ర స్థాయి పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఆయా రాష్ట్రాల్లోనూ ఇటీవల పర్యటించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలు షెడ్యూల్ ప్రకటించారు.
ఎన్నికల షెడ్యూల్‌కు ముందు రాజకీయ పార్టీ నేతలతో, ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించి సలహాలు స్వీకరించామని జ్ఞానేశ్ కుమార్ వివరించారు. ఈ ఐదు ప్రాంతాల్లో మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, 2.18 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
తమిళనాడు, కేరళ, అస్సోం, పుదుచ్చేరి రాష్ట్రల్లో ఒకే దశలో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అయితే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం రెండు దశల్లో పోలింగ్ జరుగనుంది. బెంగాల్‌లో ఉన్న మొత్తం 294 స్థానాల్లో తొలి దశలో 152 స్థానాలకు, రెండో దశలో 142 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరిలో...
మొత్తం ఓటర్ల సంఖ్య - 17.4 కోట్లు
మొత్తం అసెంబ్లీ స్థానాలు 824
పోలింగ్ స్టేషన్లు - 2.19 లక్షలు
ఎన్నికల అధికారులు - 25 లక్షలు