సోమవారం, 16 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 ఫిబ్రవరి 2026 (19:44 IST)

యూపీఐ నుంచే పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా.. ఎప్పటి నుంచి అంటే....

EPFO
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై తమ పీఎఫ్ డబ్బులను యూపీఐ మొబైల్ యాప్ నుంచే విత్ డ్రా చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్‌ను రూపొందిస్తోంది. ఇది వచ్చే ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 8 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు ఉన్నారు. వీరందరికీ ప్రయోజనం చేకూర్చేలా సరికొత్త మొబైల్ అప్లికేషన్ను తీసుకరానుంది. ఈ యేడాది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా పీఎఫ్ ఖాతాదారులు తమ పీఎఫ్ ఖాతాలోని అర్హతగల మొత్తాన్ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ద్వారా తక్షణం విత్ డ్రా చేసుకునే సౌకర్యం కలగనుంది. 
 
ఈపీఎఫ్ఓ 3.0 అప్‌గ్రేడ్‌లో భాగంగా ఈ కొత్త డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం పీఎఫ్ డబ్బుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని రోజుల సమయం పడుతోంది. కాగా, కొత్త ఆటో సెటిల్‌మెంట్ విధానంలో ఎలాంటి మానవ ప్రమోయం లేకుండా మూడు రోజుల్లోనే క్లెయిమ్‌లు పరిష్కారమై, డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. 
 
ఇప్పటికే ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచిన విషయం తెల్సిందే. ఈ మొబైల్ యాప్ అందుబాటులోకి వస్తే ప్రతి యేటా 5 కోట్లకు పైగా క్లెయిమ్‌లను పరిష్కరించే ఈపీఎఫ్ఓపై భారాన్ని తగ్గించి, బ్యాంకుల తరహాలో వేగవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
ప్రస్తుతం కేంద్ర కార్మిక, ఉపాది కల్పనా మంత్రిత్వ శాఖ 100 డమ్మీ ఖాతాలతో ఈ యాప్‌పై ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ఏవైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే గుర్తించి పరిష్కరించిన తర్వాత ప్రజా వినియోగంలోకి తీసుకునిరానుంది.