గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 జూన్ 2016 (16:49 IST)

ట్రిపుల్ తలాక్‌పై ముస్లిం మహిళల మండిపాటు : దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం!

ముస్లిం సంప్రదాయంలో వివాహ రద్దు (విడాకుల) కోసం ఆచరణలో ఉన్న తలాక్ (ట్రిపుల్ తలాక్) విధానాన్ని ముస్లిం మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ముస్లిం సంప్రదాయంలో వివాహ రద్దు (విడాకుల) కోసం ఆచరణలో ఉన్న తలాక్ (ట్రిపుల్ తలాక్) విధానాన్ని ముస్లిం మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా ఆందోళనకు కూడా దిగారు. అంతేకాకుండా, ఈ అనైతిక విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ యాభైవేల మంది ముస్లింలు సంతకాలు కూడా చేశారు. 
 
ప్రస్తుతం ఇస్లాం మతంలో ట్రిపుల్‌ తలాక్‌ విధానం అమల్లో ఉంది. దీనిపై ఆ మతం మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా తలాక్‌ చెప్పి తమ జీవితాన్ని నాశనం చేయవద్దని ప్రాధేయపడుతున్నారు. ట్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించారు. బంధువుల సమక్షంలో చర్చలు జరపకుండా ఇష్టం వచ్చినట్లు తలాక్‌ ఇచ్చి తమ జీవితాలను నాశనం చేస్తున్నారని వాపోతున్నారు. 
 
ముఖ్యంగా కొంతకాలంగా సోషల్‌ మీడియా, స్పీడ్‌ పోస్టు ద్వారా తలాక్‌ చెప్పే విధానంపై ముస్లిం మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విధానంలో తలాక్‌ చెప్పేవారికి కొందరు మత పెద్దలు మద్దతు ఇవ్వడంపై కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఫలంగా వదిలివేస్తే తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ట్రిపుల్‌ తలాక్‌ విధానానికి వ్యతిరేకంగా భారతీయ ముస్లిం మహిళా ఆందోళన సంస్థ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు. 
 
జాతీయ మహిళా కమిషన్‌కు ట్రిపుల్‌ తలాక్‌తో జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేసిన ఈ సంస్థ 50 వేలకు మందికిపైగా ముస్లిం యువకుల నుంచి మద్దతు సంపాదించింది. సోషల్‌ మీడియా ద్వారా తలాక్‌ చెప్పే విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామనంటూ ముస్లిం యువకులతో సంతకాలు చేయించింది. ముస్లిం మహిళలకు న్యాయం జరగాలంటే ముస్లిం పర్సనల్‌ లా బోర్డులో సంస్కరణలు తేవాలని భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ కోరుతోంది.