త్రీ సిస్టర్స్ సూసైడ్ కేసు : కొరియన్ గేమ్ చివరి టాస్క్ ఆత్మహత్యనా?
ఆన్‌లైన్ గేమ్‌కు బానిసలైన ముగ్గురు అక్కా చెల్లెళ్లు తాము నివసించే అపార్టుమెంట్ తొ్మ్మిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కొరియన్ ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ వచ్చిన వారు... చివరి టాస్క్‌గా బలవన్మరణానికి పాల్పడటమే. అదే వారు చేశారు.
ఇదే విషయంపై మృతుల తండ్రి మీడియాతో మాట్లాడుతూ, రెండున్నరేళ్లుగా మా ముగ్గురు పిల్లలు ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్నారు. దీంతో వారు క్రమంగా కుటుంబానికి దూరమవుతూ వచ్చారు. ఎపుడూ ఫోన్లు పట్టుకుని వారి గదులకే పరిమితమయ్యేవారు. ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లలో ఒకరు ఇన్‌స్ట్రక్టర్‌గా ఉంటే మిగిలిన ఇద్దరూ ఆదేశాలు పాటించేవారు. వారి ఫోన్లలో చివరి టాస్క్ సూసైడ్ అని ఉందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
ఈ ముగ్గురు బాలికలు ఆత్మహత్యకు ముందు తమ గదిలోకి వెళ్లి బోల్ట్ పెట్టుకున్నారు. తర్వాత గది నుంచి బాల్కనీకి వచ్చి ఒకరి తర్వాత ఒకరు కిందకు దూకేశారు. వారి కేకలు, వారు నేలపై పడిన శబ్దాలతో అపార్టుమెంట్‌లోని వారు సెక్యూరిటీ సిబ్బంది పరుగెత్తుకు వచ్చారు. తొమ్మిదో అంతస్తు నుంచి దూకడంతో ఆ ముగ్గురు బాలికలు నేలపై రక్కపు మడుగులో కనిపించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.