గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2015 (20:43 IST)

అశ్లీల వెబ్‌సైట్ల బ్లాక్.. విమర్శల జడివానతో వెనక్కి తగ్గిన కేంద్రం...

దేశంలో పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా విమర్శల జడివాన కురుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అశ్లీల వెబ్‌సైట్లను బ్లాక్ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అనేక మంది ప్రముఖులు, సుప్రసిద్ధ రచయితలు, నెటిజన్లు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రభుత్వంపై నిరసన గళమెత్తారు. 
 
విజ్ఞానం సర్వస్వం అటువంటి వెబ్ సైట్లలోనే ఉందని, అలాంటి వెబ్ సైట్లను నిషేధిస్తే ప్రజల జ్ఞానచక్షువులు తెరుచుకునేది ఎలా? అంటూ కేంద్రాన్ని నిలదీశారు. పోర్న్ సైట్లు చూడడమే అసలైన స్వేచ్ఛ అన్నంతగా రచయితలు కేంద్రంపై విరుచుకుపడ్డారు. 
 
దీంతో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ తరహా సైట్లపై నిషేధం విధించలేదని కేవలం నిఘా మాత్రమే పెట్టినట్టు కేంద్ర టెలికాం, ఐటీ శాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం వివరణ ఇచ్చారు. అయినప్పటికీ.. విమర్శలు తగ్గలేదు. సుప్రసిద్ధ రచయిత చేతన్ భగత్ ఘాటుగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోర్న్ సైట్లు కాదు... మగవాళ్ల దొంగచూపులను నిషేధించండి అంటూ మండిపడ్డారు. దీంతో కేంద్రం వెనక్కి తగ్గి అశ్లీల వెబ్‌సైట్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.