మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 17 జనవరి 2016 (13:47 IST)

జంతువులకూ రిటైర్మెంట్‌ బెన్ఫిట్స్‌... అలాంటివాటికి మాత్రమే కారుణ్య మరణాలు!

భారత రక్షణ శాఖలో సేవలందించే మూగజీవులకు రిటైర్మెంట్ బెన్ఫిట్స్ అందజేస్తామని అడిషనల్‌ సొలిసెటర్‌ జనరల్‌ సంజయ్‌ జైన్‌ కోర్టుకు వెల్లడించారు. అలాగే, తీవ్ర గాయాలు తగిలి, దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతున్న మూగ జీవులకు మాత్రమే కారుణ్య మరణం కల్పిస్తామని తెలిపారు. 
 
భారత సైన్యంలో సేవలందించే కుక్కలు, గుర్రాలు తదితర జంతువులను పదవీ విరమణ చేసిన తర్వాత ఏం చేస్తారో తెలియజేయాలని ఆర్‌.ఖన్నన్‌ గోవిందరాజులు అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని అడిగారు. దీనికి సమాధానంగా వాటి సర్వీస్‌ ముగిసిన అనంతరం మందుల ద్వారా కారుణ్య మరణాలను ఇస్తుందని తెలియజేసింది. సైన్యం చేస్తున్న ఈ చర్య జంతువుల హక్కుల ఉల్లంఘనే అని అడ్వకేట్‌ సంజయ్‌ కుమార్‌ సింగ్‌ ఢిల్లీ పేర్కొంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన ఛీప్‌ జస్టీస్‌ రోహిణి, జస్టీస్‌ జయంత్‌‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై వివరణ ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని, రక్షణ మంత్రిత్వశాఖని ఆదేశించింది. దీనికి స్పందించిన రక్షణశాఖ ఇకపై కేవలం కోలుకోలేని వ్యాధులు, తీవ్ర గాయాలతో బాధపడుతున్న వాటిని తప్ప సర్వీస్‌ నుంచి తప్పుకొనే కుక్కలు, గుర్రాలకు కారుణ్య మరణాన్ని ఇవ్వబోమని కోర్టుకు వెల్లడించింది. 
 
త్వరలోనే వాటికి అన్ని వసతులతో కూడిన పునరావాసాన్ని కల్పిస్తామని ఆర్మీ వెటర్నరీ డైరెక్టరేట్‌ తెలియజేసింది. సైన్యం నుంచి పదవి విరమణ చేసిన కుక్కలు, గుర్రాలను పెంచుకోవాలనుకునే వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే విషయాన్ని పరిగణలోకి తీసుకోనున్నట్లు డైరెక్టరేట్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.