1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Hinduism is a way of life, not essential for follower to visit temple: Supreme Court

హిందూ మతం అనేది ఒక జీవన విధానం : సుప్రీంకోర్టు

supreme court
హిందూ మతం అనేది ఒక జీవన విధానమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హిందువునని నిరూపించుకోవడానికి రోజూ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదని, రోజూ ఒక దీపం వెలిగిస్తే చాలని దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. హిందూ మతం, విశ్వాసాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. మతం అంటే కేవలం బాహ్య అచారాలు మాత్రమే కాదని, అది ఒక అంతర్గత విశ్వాసం అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. 
 
శబరిమల వంటి ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. హిందువుగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రతి రోజూ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదని, ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా అది ఆ వ్యక్తి మతాన్ని, విశ్వాసాన్ని చాటి చెప్పడానికి సరిపోతుందని సీజేఐ పేర్కొన్నారు. 
 
ధర్మాసనంలో మరో న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ, హిందూ మతం అనేది ఒక పద్దతికి లోబడిన మతం కాదని, అది ఒక జీవన విధానమని అభివర్ణించారు. ఆచారాలను ఖచ్చితంగా పాటించాలన్న నిబంధన ఏమీ లేదని, ఆచారబద్ధంగా లేకపోయినా ఒక వ్యక్తికి మతంపై విశ్వాసం ఉండొచ్చని ఆమె స్పష్టం చేశారు. 
 
ప్రతి చిన్న మతపరమైన ఆచారాన్ని లేదా విషయాన్ని న్యాయస్థానాల్లో ప్రశ్నించడం ప్రారంభిస్తే అది మతాల పతనానికి దారితీస్తుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్ల వల్ల కోర్టులపై భారం పెరిగిపోవడమే కాకుండా, మతపరమైన సామరస్యం దెబ్బతినే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
చారిత్రాత్మక వార్షిక స్కాలర్‌షిప్ హామీని ప్రకటించిన యుడబ్ల్యుఏ ఇండియా