శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2015 (11:54 IST)

పోర్న్ సైట్లను బ్యాన్ చేస్తే వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ.. అందుకే వెనక్కి తగ్గిన కేంద్రం!

అశ్లీల వెబ్‌సైట్ల (పోర్న్ సైట్లు)పై నిషేధం విధించిన కేంద్రం... ఆ వెంటనే వచ్చిన విమర్శల జడివానతో వెనక్కితగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోర్న్ సైట్లను నిషేధిస్తే వాటితో పాటు వైద్య, విజ్ఞాన రంగాలకు సంబంధించిన కీలక సమాచారం కూడా గల్లంతవుతుందంటూ విమర్శకులు అభిప్రాయపడ్డారు. 
 
ముఖ్యంగా ఈ తరహా సైట్లను నిషేధించడం వల్ల ఎయిడ్స్‌కు సంబంధించిన సమాచారం కూడా దొరకదని, సెక్స్ సమస్యలపై సమాచారం కూడా గల్లంతవుతుందంటూ వారు అభిప్రాయపడ్డారు. దీంతో మోడీ సర్కారు వెనకడుగు వేసింది. అశ్లీల సైట్లపై నిషేధం విధించలేదని, కేవలం విపరీత పరిణామాలకు దారి తీయకుండా పర్యవేక్షణ మాత్రమే చేస్తున్నామని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
పైగా ఈ పోర్న్ సైట్లను నిషేధించడం వల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని మోడీ ప్రభుత్వం బేరీజు వేసింది. అందువల్లే నిషేధం విధించిన కొన్ని గంటల్లోనే దాన్ని తొలగించాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ కేంద్రం తన నిర్ణయంపై అలాగే ఉన్నప్పటికీ... పోర్న్ సైట్స్‌ను తిలకించడం పెద్ద కష్టమేమి కాదు. 
 
ఏదో ఒక పోర్న్ స్టార్ పేరు మీద అశ్లీల వెబ్‌సైట్లలోకి ఈజీగా వెళ్లవచ్చు. పైగా దేశంలోని యువతీయువకుల్లో పెక్కుశాతం మందికి ఈ సైట్లను వీక్షించే అలవాటు ఉండటంతో వారి నుంచి తీవ్రమైన విమర్శలు సోషల్ మీడియాలో ఎదుర్కోవాల్సి వచ్చింది. అందువల్ల ఈ నిషేధం కొనసాగినపక్షంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని భావించడంతో ఈ సైట్లను నిషేధించకుండా కేవలం పర్యవేక్షించాలని మాత్రమే నిర్ణయించింది కేంద్రం. మొత్తంమీద పోర్న్ సైట్స్‌ను పూర్తిగా నిషేధించడం సాధ్యంకాదనే వాదనలు, విమర్శలతో కేంద్రం వెనక్కు తగ్గింది.