ఇరాన్ యుద్ధ నౌకను అలా కాపాడిన భారత్ శ్రీలంక నావీ.. ఏం జరిగింది?
ఇరాన్ నావికాదళానికి చెందిన ఫ్రిగేట్ ఐరిస్ డెనా శ్రీలంక తీరానికి సమీపంలో అమెరికా దాడికి గురై మునిగిపోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై భారత నౌకాదళం గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆపదలో ఉన్న నావికులను రక్షించేందుకు శ్రీలంక నావికాదళంతో కలిసి సంయుక్తంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
ఈ ఇరాన్ నౌక ఇటీవల విశాఖపట్నంలో భారత నౌకాదళం భారీ స్థాయిలో నిర్వహించిన మిలాన్-2026 విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళుతుండగా ఈ దాడి చోటుచేసుకుంది. అమెరికా సబ్‌మెరైన్ నుంచి వచ్చిన టార్పిడో దాడి వల్లే ఇరాన్ నౌక మునిగిపోయిందని వెల్లడైంది. ఈ ఘటనను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తీవ్రంగా ఖండించారు.
ఇక ఇరాన్ నౌక పంపిన అత్యవసర సందేశం పట్ల వెంటనే స్పందించామని, మానవతా దృక్పథంతో సహాయక చర్యలు చేపట్టామని భారత నౌకాదళం వెల్లడించింది. ఆపదలో ఉన్న నావికులను రక్షించేందుకు శ్రీలంక నావికాదళంతో కలిసి సంయుక్తంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
మార్చి 4వ తేదీ ఉదయం శ్రీలంకలోని గాల్లే తీరానికి సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో ఐరిస్ డెనా నౌక నుంచి డిస్ట్రెస్ కాల్ వచ్చినట్లు శ్రీలంక మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (ఎంఆర్ సీసీ) గుర్తించింది. ఈ సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం అప్రమత్తమైంది.
లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఘటనా స్థలానికి పంపించి గాలింపు చర్యలు ప్రారంభించింది. సముద్రంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు లైఫ్ రాఫ్ట్‌లను ఎయిర్-డ్రాప్ చేయడానికి మరో విమానాన్ని కూడా సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ నౌకలు ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
ఈ ఘటనలో శ్రీలంక నావికాదళం సత్వరమే స్పందించి 32 మంది గాయపడిన ఇరానియన్ నావికులను రక్షించింది. దురదృష్టవశాత్తు కొన్ని మృతదేహాలను కూడా వెలికితీశారు. నౌకలో సుమారు 130 నుంచి 180 మంది సిబ్బంది ఉన్నట్లు అంచనా వేస్తుండటంతో, మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.