మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 జూన్ 2016 (11:59 IST)

యోగాను ప్రజాఉద్యమంగా మలచండి .. ప్రధాని పిలుపు :: 100 దేశాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో

యోగాను ప్రజా ఉద్యమంగా మలచాలని కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన తన మంత్రివర్గ సహచరులకు పిలుపునిచ్చారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగనున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ప్రజల రోజువారీ జీవితంలో యోగాను అంతర్భాగం చేయడానికి ఈ దినోత్సవం ఒక మార్గమని పేర్కొన్నారు. 
 
సమాజంలోని విభిన్న వర్గాల్లో, వేర్వేరు వయస్కుల్లో ఈ కార్యక్రమం ద్వారా యోగాకు ప్రాచుర్యం కల్పించడానికి మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. గత ఏడాది మొదలైన ఊపును మరింత ముందుకు తీసుకువెళ్లడానికి, ముఖ్యంగా యువత చురుగ్గా పాల్గొనేలా చేయడానికి నిర్ణయించామని చెప్పారు. యోగా ఉపయోగాలను చాటి చెప్పాలని కోరారు. కాగా, యోగా దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి కార్యక్రమాన్ని చండీగఢ్‌లో నిర్వహిస్తారు. ఈ ఏడాది యోగా దినోత్సవానికి ఒక ఉమ్మడి కార్యక్రమాన్ని ఆయుష్‌ మంత్రిత్వశాఖ రూపొందించింది. 
 
మరోవైపు.. భారత్‌తో పాటు 100 దేశాల్లో ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ (ఎ.ఒ.ఎల్‌.) నిర్ణయించింది. బ్రసెల్స్‌ పార్లమెంట్ భవనంలో శాసనకర్తలతో యోగా చేయించడం ద్వారా ఈ ఉత్సవాలను ఎ.ఒ.ఎల్‌. వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రారంభిస్తారు. సుదర్శన్‌ క్రియ, యోగా, ధ్యానాలకు సంబంధించి వాషింగ్టన్‌, బోస్టన్‌, కొలంబస్‌, మిన్నెసోటా, శాన్‌ఫ్రాన్సిస్కో, పోర్ట్‌లాండ్‌, సియాటిల్‌ నగరాల్లో, యూకేలో జరిగే కార్యక్రమాలకు ఆయన నేతృత్వం వహిస్తారు. ముంబైలో నాలుగుచోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.