1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Just moments before separation, woman rips up divorce papers and hugs husband Viral video

విడాకుల కోసం ఐదేళ్ల పోరాటం చేశారు.. హగ్ చేసుకుని ఐదు నిమిషాల్లో కలిసిపోయారు... (వీడియో)

delhi couple hugging
ఓ జంట విడాకుల కోసం ఐదేళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. ఆర్థికంగా నష్టపోయారు. కానీ, ఓ చిన్న సంఘటనతో కేవలం ఐదు నిమిషాల్లో కోర్టు హాలులో న్యాయమూర్తి సమక్షంలో ఒకరినొకరు హత్తుకుని కన్నీరు పెట్టుకుని కలిసిపోయారు. దీంతో ఐదేళ్ళ విడాకుల కేసు కేవలం ఐదు నిమిషాల్లో తేలిపోయింది. దీంతో న్యాయమూర్తితో సహా అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీకి చెందిన సౌరభ్ అనే వ్యక్తికి గత 2020లో శిఖ అనే యువతితో వివాహం జరిగింది. కొంతకాలం తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వారు కోర్టును ఆశ్రయించి, ఐదేళ్లుగా ఫ్యామిలీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కోర్టు, న్యాయవాదుల ఖర్చుల కోసం పెట్టిన ఖర్చులతో ఆర్థికంగా నష్టపోయారు. 
 
ఒక వైపు తన కుమార్తె విడాకుల కేసు, మరోవైపు ఆర్థికంగా నష్టపోవడంతో శిఖ తండ్రి ఇటీవల గుండెపోటు వచ్చింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రిలో చూపించలేక ఆయన్ను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సౌరభ్... తన మామగారైన శిఖ తండ్రిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 
 
ఇదిలావుంటే, ఈ దంపతుల విడాకుల కేసు తాజాగా కోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణ కోసం దంపతులు కోర్టు ముందు హాజరయ్యారు. ఇరువురి తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తుండగా, విడాకులో తీసుకోవాలని ఇప్పటికీ అనుకుంటున్నారా అని న్యాయమూర్తి సౌరభ్‌ను అడిగారు. వెంటనే కోర్టు రూమ్‌లో ఉన్న శిఖ  తన వద్ద ఉన్న విడాకుల పత్రాలను చింపేసి భర్తను హత్తుకుని బోరున విలపించసాగింది. అనంతరం తాము విడాకులు తీసుకోమని, కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్టు వారు కోర్టుకు తెలిపారు. దీంతో ఐదేళ్ల సమస్య కేవలం ఐదు నిమిషాల్లో సుఖాంతమైంది. 


 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువలో ఎన్డీయే