ఓటు ప్రాథమిక హక్కు.. దాన్ని ఎన్నికల సంఘం తనిఖీ చేస్తోంది : కమల్ హాసన్
దేశంలోని ప్రతి పౌరుడికి ఓటు అనేది ప్రాథమిక హక్కు అని, దాన్ని ఎస్.ఐ.ఆర్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం తనిఖీ చేస్తోందని సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు రాష్ట్రంలో ఈసీ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
'రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల గురించే నా ఆందోళన. దాన్ని అక్షరదోషాలు తనిఖీ చేసే ప్రక్రియగా భావిస్తున్నా. ఓటు ప్రాథమిక హక్కు. ఎన్నికల కమిషన్ మాత్రం మా హక్కును తనిఖీ చేస్తోంది. జాబితా పరిశీలనల్లో అనేక తప్పిదాలు జరుగుతున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో దాదాపు కోటి మంది అర్హులైన ఓటర్లు చనిపోయినవారి జాబితాలో ఉండవచ్చని ఆందోళన చెందుతున్నాం. బిహార్‌లో బతికున్న వారిని చనిపోయిన వారి ఓటర్ల జాబితాలో చేర్చారు. అటువంటి పరిస్థితి దేశమంతటా వ్యాప్తి చేయొద్దని కోరుకుంటున్నాం' అని అన్నారు.
భాష గురించి మాట్లాడిన కమల్.. తనకు తమిళ ఉపాధ్యాయులు భాషను పరిచయం చేశారని చెప్పారు. తమ భాష, సంస్కృతిపై జరిగే ఎటువంటి దాడినైనా ఎదుర్కోవాలని సీఎన్ అన్నాదురై.. తదితర నేతల నుంచి నేర్చుకున్నానని అన్నారు. హైస్కూల్ మధ్యలో చదువు మానేసిన తాను ఆర్థికశాస్త్రంపై మాట్లాడేందుకు అర్హుడని కాదని ఎవరు అనుకున్నా అభ్యంతరం లేదని, తాను మాత్రం మాట్లాడుతానని స్పష్టంచేశారు. తమిళుడిగా తనకు ఓ స్పష్టమైన అభిప్రాయం ఉందన్నారు.