నా భార్య చితక్కొడుతోంది... రక్షించండి మహాప్రభో : ఖాకీలను ఆశ్రయించిన కన్నడ నటుడు
సాధారణంగా భార్యను భర్తలు వేధించడం, చిత్రహింసలకు గురిచేయడం, చావబాదడం, హత్యలు చేయడం ఇపుడు సర్వసాధారణమై పోయింది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తన భార్య చితక్కొడుతోందనీ ఆమె నుంచి తనను రక్షించాలంటూ ఓ కన్నడ నటుడు పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడుగా గుర్తింపు పొందిన ధనుశ్ రాజ్ - అర్షిత దంపతులు ఉన్నారు. అయితే, ధనుశ్ రాజ్ తన భార్యపై పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. తన భార్య తనపై శారీరకంగా దాడి చేసి గాయపరచడంతో పాటు వేధింపులకు గురిచేస్తోందనీ, ప్రాణహాని బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బెంగుళూరు నగరంలోని గిరినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య కారణం చెప్పకుండా విదేశాలకు వెళ్లిందని, ఈ విషయంపై ప్రశ్నించగా, దాడి చేసి తీవ్రంగా దాడి చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పైగా, అర్షిత బాత్రూమ్‌లోని గ్లాస్ ప్యానెల్‌కు చేయి కొట్టుకుని కావాలనే గాయపరుచుకుందని, ఆ దాడికి తానే కారణమని చిత్రీకరించే ప్రయత్నం చేసిందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నాడు. ఆత్మహత్య చేసుకుని తనను ఇరికిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతోందని ధనుశ్ ఆరోపించారు. భార్య నుంచి వస్తున్న నిరంతర వేధింపులు, బెదిరింపుల కారణంగా మనశ్శాంతి లేకుండా పోయిందని ఆమె నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. ధనుశ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు వెల్లడించారు.