నోరు జారితే ఏడేళ్ల జైలుశిక్ష : కర్నాటకలో ద్వేషపూరిత వ్యాఖ్యల వ్యతిరేక బిల్లు
కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నోరు జారితే ఇక ఏడేళ్లపాటు జైలుశిక్ష విధించనున్నారు. ఈ మేరకు కర్నాటక రాష్ట్ర శాసనసభలో ద్వేషపూరిత వ్యాఖ్యల వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టారు. కులం, మతం, లింగం, జన్మస్థలం వంటి అంశాలపై ఇతరుల మవోభావాలను దెబ్బతినేలా మాట్లాడితే కఠిన శిక్షలు, జరిమానాలు విధించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.
ఈ బిల్లు ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి జి.పరమేశ్వర సభ ముందు ఉంచారు. ఈ బిల్లు ప్రకారం, ప్రజా జీవితంలో ఉన్నవారు, సాధారణ వ్యక్తులు లేదా మరణించిన వారిపై ఉద్దేశపూర్వకంగా చేసే వ్యాఖ్యలు, సంజ్ఞలు, రాతలు, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా చేసే దుష్ప్రచారాన్ని ద్వేషపూరిత నేరంగా పరిగణిస్తారు. తొలిసారి ఈ నేరానికి పాల్పడితే ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తారు. అదే నేరాన్ని మళ్లీ చేస్తే రెండేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు, రూ.లక్ష జరిమానా తప్పదు.
ఈ నేరాలను నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తారు. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిపి శిక్షలు ఖరారు చేసేలా బిల్లును రూపొందించారు. అయితే, బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష బీజేపీ సభ్యులు వ్యతిరేకత తెలిపారు. మూజువాణి ఓటింగును కాదని, డివిజన్‌కు పట్టుబట్టారు. అయినప్పటికీ స్పీకర్ యూటీ ఖాదర్ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతించారు.
ఈ బిల్లు ప్రభుత్వ అజెండాలో భాగమని, విద్వేష వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత ఆమోదిస్తారు. ఆ తర్వాత గవర్నర్ అనుమతికి పంపించి, ఆమోదముద్ర పడితే అది చట్టరూపం దాల్చుతుంది.