గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2026 (13:33 IST)

జైలులో పెళ్లిపీటలెక్కిన హత్య కేసు దోషులు

Wedding
రాజస్థాన్ రాష్ట్రంలో సంచలన హత్య కేసుల్లో జీవిత కారాగారశిక్షలను అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు పెళ్లితో ఒక్కటయ్యారు. జైపూర్‌లోని ఓపెన్‌ జైలులో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా, పెళ్లి  చేసుకునేందుకు కోర్టు అనుమతితో పెరోల్‌‍పై బయటకు వచ్చారు. అల్వార్ జిల్లా బరోడామేవ్‌లో శుక్రవారం వీరి వివాహం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హనీట్రాప్ చేసి దుష్యంత్ శర్మ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో ప్రియసేథ్ (33) యావజ్జీవ శిక్ష అనుభవిస్తోంది. మరోవైపు, 2017లో అల్వార్‍‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని దారుణంగా హత్య చేసిన కేసులో హనుమాన్ ప్రసాద్ అలియాస్ జాక్ (32) జీవిత ఖైదీగా ఉన్నాడు. వీరిద్దరినీ యేడాది క్రితం జైపూర్ సెంట్రల్ జైలు నుంచి సంగనే‌ర్‌‍లోని ఓపెన్ జైలుకు మార్చారు. 
 
ఓపెన్ జైల్లో వీరి మధ్య పరిచయం ఏర్పడి, ఆరు నెలల క్రితం అది ప్రేమగా మారింది. గత నాలుగు నెలలుగా జైలు ప్రాంగణంలోనే ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్టు సమాచారం. గత యేడాది నవంబరు నెలలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తమ కుటుంబాలకు తెలిపారు. డిసెంబరు నెలలో పెరోల్‌ కోసం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యర్థనలో భాగంగా కోర్టుకు పెళ్లి పత్రికను కూడా సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు జిల్లా పెరోల్‌‍ సలహా కమిటీ వీరికి పెళ్లి కోసం పెరోల్ మంజూరు చేసింది. 
 
అల్వార్ జిల్లాలోని హనుమాన్ పూర్వీకుల ఇంట్లో మూడు రోజుల వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ప్రియ, హనుమాన్ గతంలో తాము నేరం చేసిన సమయంలో ఉన్న భాగస్వాములు కూడా ప్రస్తుతం యావజ్జీవ శిక్ష అనుభవిస్తుండటం గమనార్హం. జైలు గోడల మధ్య మొదలైన ఈ వినూత్న ప్రేమకథ, పెళ్లి ఇపుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.