సరిహద్దు వెంబడి కంచె నిర్మాణానికి భూమి ఇస్తాం : మమతా బెనర్జీ
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె నిర్మాణానికి కేంద్రానికి భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. అయితే రాష్ట్రంలో బీఎస్‌ఎఫ్ అధికార పరిధిని పెంచుతూ గతంలో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం ముందుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ, కంచె ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని కేంద్రం, భాజపా చేస్తున్న ఆరోపణలను ఖండించారు. 'దేశ భద్రతకు కట్టుబడి ఉన్నాం. కంచె విషయంలో భూమి అనేది సమస్య కాదు. అవసరమైనంత మేరకు కేటాయిస్తాం.
కానీ, ముందుగా బీఎస్ఎఫ్ అధికార పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచుతూ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని మార్చండి. రైల్వేల నుంచి రక్షణ వరకు అనేక కేంద్ర విభాగాలకు భూమి కేటాయింపు విషయంలో సహకరించాం. ఫెన్సింగ్ విషయంలో కేంద్రం కొన్ని వాస్తవాలనే ప్రజల ముందు ఉంచుతోంది. రాష్ట్రం ఇప్పటికే ఎంత భూమిని కేటాయించిందనే దానిపై కేంద్రమంత్రి అమిత్ షా ఎక్కడా వివరాలు వెల్లడించడం లేదు' అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
బెంగాల్‌లో చొరబాట్లనేవీ ముప్పుగా పరిణమించాయని, కంచె కోసం భూమి కోరుతూ కేంద్రం చాలాసార్లు లేఖలు రాసినప్పటికీ ఫలితం లేకపోయిందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. అయితే.. చొరబాట్లు, రోహింగ్యాల విషయంలో సాక్ష్యాలను చూపించాలని భాజపాకు ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. పాలన విషయంలో తాను పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఫెన్సింగ్ కోసం ఇప్పటికే కేటాయించిన భూమిలో ముందుగా పనులు పూర్తి చేయాలని వ్యాఖ్యానించారు.