మంగళవారం, 20 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 5 డిశెంబరు 2025 (22:50 IST)

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

court
సహజీవనం ఇప్పుడు ఎక్కువగా వినబడుతున్న మాట. నగరాలు, పట్టణాల్లో తమకు ఇష్టమైన వారితో పెళ్లికి ముందే యువతీయువకులు సహజీవనం చేస్తున్నారు. అనంతరం ఇద్దరికీ ఇష్టమైతే వివాహం చేసుకుంటున్నారు. ఐతే రాజస్థాన్ రాష్ట్రంలో ఓ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పెళ్లి వయసు రాకున్నప్పటికీ యుక్తవయసులో వున్న ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేయడం తప్పు కాదని తీర్పు చెప్పింది. వివాహ వయసు రాకపోయినా కలిసి జీవించేందుకు ఎలాంటి ఆటంకం వుండదనీ, వివాహ వయస్సు అనే కారణంతో రాజ్యాంగం కల్పించిన హక్కులను కొట్టివేయలేమంటూ న్యాయస్థానం పేర్కొంది.
 
న్యాయస్థానం ఇచ్చిన తీర్పు గురించి చూస్తే... 19 ఏళ్ల బాలుడు, 18 ఏళ్ల యువతి ఇద్దరూ తమకు రక్షణ కల్పించాలంటూ రాజస్థాన్ హైకోర్టులో పిటీషన్ వేసారు. తామిరువురం అంగీకారంతో సహజీవనం చేస్తున్నామనీ, ఐతే అమ్మాయి కుటుంబ సభ్యులు తమ సహజీవనాన్ని వ్యతిరేకిస్తున్నారని, తమను చంపేస్తామంటూ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
ఐతే పిటీషన్ ను వ్యతిరేకిస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సదరు యువకుడికి ఇంకా 21 ఏళ్లు నిండలేదనీ, పెళ్లి వయసు కూడా రాలేదు కనుక సహజీవనం చేసేందుకు అనుమతి ఇవ్వరాదంటూ వాదించారు. వాద ప్రతివాదనలను విన్న కోర్టు... పెళ్లి వయసు రాలేదనే కారణంతో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కును హరించలేమంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కొట్టివేసింది. అలాగే పిటీషనర్లకు పూర్తి రక్షణను పోలీసులు కల్పించాలని ఆదేశించింది. ఈ తీర్పు వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.