మంగళవారం, 17 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 ఫిబ్రవరి 2026 (10:00 IST)

ముస్లీం రిజర్వేషన్లు రద్దు... సంచలన నిర్ణయం తీసుకున్న సర్కారు

muslim woman
మహారాష్ట్రలోని భారతయన జనతా పార్టీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ముస్లింలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తూ వచ్చిన 5 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. ఈమేరకు 2014లో జారీ చేసిన ప్రభుత్వ తీర్మానాన్ని అధికారికంగా రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంగళవారం కొత్త ఉత్తర్వులు జారీచేసింది. పదేళ్లకు పైగా చట్టపరంగా అమలులో లేని ఈ రిజర్వేషన్లను, ఇప్పుడు అధికారిక రికార్డుల నుంచి తొలగించారు.
 
2014లో అప్పటి కాంగ్రెస్ - ఎన్సీపీ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ ద్వారా ముస్లింలను స్పెషల్ బ్యాక్ వర్డ్ క్లాస్-ఏ (ఎస్బీసీ- ఏ) కేటగిరీ కింద చేర్చి 5 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే, దీనిపై బాంబే హైకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత నిర్దేశిత గడువులోగా ఆ ఆర్డినెన్స్‌ను శాసనసభలో చట్టంగా మార్చకపోవడంతో అది వాటంతట అదే మురిగిపోయింది. సుప్రీంకోర్టు కూడా ఈ కోటాను పక్కన పెట్టింది.
 
న్యాయస్థానాల జోక్యం, ఆర్డినెన్స్ గడువు ముగియడంతో ఈ రిజర్వేషన్లు దశాబ్ద కాలంగా అమలులో లేవు. అయినప్పటికీ, పాత జీవో ప్రభుత్వ రికార్డుల్లో కొనసాగుతూ వచ్చింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో పాత జీవోను, దానికి సంబంధించిన అన్ని సర్క్యులర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 
 
ఇకపై ఈ కేటగిరీ కింద ఎలాంటి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయరాదని స్పష్టం చేసింది. ఇది కేవలం పరిపాలనాపరమైన సవరణ మాత్రమేనని, రికార్డులను సరిచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఇది మైనారిటీల అభివృద్ధిని అడ్డుకునే కుట్ర అని కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ) నేతలు విమర్శించారు. 'ఈ నిర్ణయంతో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలకు అన్యాయం చేసింది' అని కాంగ్రెస్ నేత నసీమ్ ఖాన్ ఆరోపించారు.