1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Maharashtra : Hausabai gaikwad plows field instead of bull, maharashtra govt respond

ఎద్దుతో కలసి కాడి మోసిన రైతు భార్య : స్పందించిన మహా సర్కారు

woman - bull
మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ జోడెద్దు అవతారమెత్తారు. ఇది ఆ రైతు కుటుంబం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులకు అద్దం పడుతోంది. పిడుగుపాటుకు తమ ఎద్దు మృతి చెందడంతో ప్రత్యామ్నాయం లేక మహిళే ఎద్దు స్థానంలో కాడి మోయాల్సి వచ్చింది. ఖరీఫ్ సాగు కోసం తన భర్తతో కలిసి పొలాన్ని దున్నింది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు.
 
లాతూర్ జిల్లాలోని దేవని తాలూకా బొంబాలి గ్రామానికి చెందిన కౌలు రైతు కాశీనాథ్ గైక్వాడ్‌కు రెండు ఎద్దులు ఉండగా, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పిడుగు పడటంతో వాటిలో ఒకటి మరణించింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో, కొత్త ఎద్దును కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేక ఆ దంపతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ క్రమంలో కాశీనాథ్ భార్య హౌసాబాయి గైక్వాడ్, మిగిలిన ఒక్క ఎద్దుతో కలిసి తానూ కాడి మోసింది. తమ ఎనిమిది ఎకరాల పొలాన్ని దున్నడానికి ఆమె సిద్ధమైంది.
 
ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నాయకులు స్పందించారు. ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్, శివసేన (యూబీటీ) ఎమ్మెల్సీ అంబదాస్ దాన్వే ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ సాయం కోరారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
 
ముఖ్యమంత్రి ఆదేశాలతో బుధవారం లాతూర్ కలెక్టర్ భరత్ నేతృత్వంలో అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి, గైక్వాడ్ కుటుంబానికి కొత్త ఎద్దును అందజేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సుమారు రూ.32,000 నష్టపరిహారాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ప్రభుత్వ సాయం అందడంతో హౌసాబాయి ఊపిరి పీల్చుకుంది. "పొలం ఎలా దున్నాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మా ఆందోళన తొలగింది" అని ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఎలక్ట్రానిక్స్ షాపింగ్ కోసం అమెజాన్ స్మార్ట్ ఛాయిస్ ఫీచర్, ఏంటది?