రూపాయికే లీటరు పాలు.. ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్...
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూపాయికే లీటర్ పాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ కర్నాటక రాష్ట్రంలో పెను దుమారాన్నే రేపింది. ఈ చర్య రైతులను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆరోపిస్తూ బెంగుళూరు మిల్క్ యూనియన్ లిమిటెడ్ (బమూల్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరతామని, అలాగే కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు (సీసీఐ) ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది.
శనివారం బమూల్ అధ్యక్షుడు డీకే సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. మార్కెట్‌ను చేజిక్కించుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి అనైతిక పోటీకి తెరలేపిందన్నారు. 'డబ్బు సంపాదించాలనే ఆత్రుతతో ఫ్లిప్‌కార్ట్ లీటర్ పాలను రూపాయికే అమ్ముతోంది. ఇది రైతాంగాన్ని నాశనం చేసే చర్య. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు తప్పవు' అని ఆయన హెచ్చరించారు. ఇది స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి ఉన్న సహకార పాల యూనియన్లను బలహీనపరిచే కుట్ర అని ఆరోపించారు.
ఈ పథకం కోసం ఫ్లిప్‌కార్ట్ సుమారు రూ.2,000 కోట్లు ఖర్చు చేసిందని, ఇప్పటికే 14.5 లక్షల లీటర్ల పాలను విక్రయించిందని సురేశ్ తెలిపారు. ఈ ఆఫర్ కారణంగా తమ యూనియన్ పాల అమ్మకాలు రోజుకు 40,000 నుంచి 50,000 లీటర్ల వరకు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు లీటరుకు రూ.38 నుంచి రూ.40 చెల్లిస్తుంటే, రూపాయికే ఎలా అమ్ముతారని ఆయన ప్రశ్నించారు. ఫ్లిప్‌కార్ట్ ఎక్కడి నుంచి పాలను సేకరిస్తోందో తెలియదని, పాల నాణ్యతను పరీక్షించేందుకు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపుతామని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ చర్యను ఫ్లిప్‌కార్ట్ వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.