మోడీజీ.. ప్లీజ్ నాకు న్యాయం చేయండి: అండర్ వరల్డ్ డాన్ కుమార్తె హసీన్ వీడియో ద్వారా విజ్ఞప్తి
అండర్‌వరల్డ్ డాన్‌గా పేరున్న హాజీ మస్తాన్ మీర్జా కుమార్తె హసీన్ మస్తాన్ మీర్జా ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసారు. ఈ పోస్ట్‌లో ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలను తనకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆమె మాట్లాడుతూ... తనకు, తన కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై న్యాయం కోసం చాలా కాలంగా పోరాడుతున్నానని, ఇప్పటివరకు తనకు న్యాయం లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే ఇతర సామాన్య పౌరుల మాదిరిగానే తనకు కూడా చట్టం ప్రకారం న్యాయం జరిగేలా చూడాలని ఆమె వీడియో ద్వారా నేరుగా ప్రధాని మోడీ, అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తిలో తన తండ్రి హాజీ మస్తాన్ మీర్జా ముంబైలోనే కాకుండా దేశవ్యాప్తంగా సుపరిచితులని చెప్పారు.
దేశ చట్టాలు బలంగా ఉంటే ప్రతి వ్యక్తికి సమాన న్యాయం జరగాలని ఆమె వీడియోలో పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న తన న్యాయ పోరాటంలో తనకు ఎలాంటి నిర్దిష్ట విజయం లభించలేదనీ, అందుకే నేరుగా ప్రధానమంత్రి, హోంమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దేశ చట్టాలు చాలా కఠినంగా ఉంటే ప్రజలు వాటిని సీరియస్‌గా తీసుకుంటారని హసీన్ వీడియోలో అన్నారు.
చట్టాలు కఠినంగా ఉంటే అత్యాచార సంఘటనలు జరగవని, హత్యాయత్నాలు ఉండవని, ఎవరూ ఎవరి ఆస్తిని స్వాధీనం చేసుకోలేరని ఆమె అన్నారు. తాను చివరి వరకు తన హక్కుల కోసం పోరాడుతానని ఆమె చెబుతున్నారు. ముంబైలోని అత్యంత ప్రభావవంతమైన అండర్‌వరల్డ్ డాన్‌లలో ఒకడైన హాజీ మస్తాన్ కుమార్తె వీడియో రాజకీయ, సామాజిక కోణాల నుండి చర్చనీయాంశంగా మారింది.