కేరళలో అధికార మార్పిడి తథ్యం : నరేంద్ర మోడీ
కేరళ రాష్ట్రంలో అధికార మార్పిడి తథ్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన తిరువనంతపురంలో జరిగిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ విజయం ఒక నగరం నుంచే ప్రారంభమైందని.. ఇదే సీన్ కేరళలో కూడా రిపీట్ అవుతుందన్నారు. ఇటీవల నగరంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా విజయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)ల అవినీతిని అంతం చేస్తామన్నారు. 'రాబోయే ఎన్నికలు రాష్ట్ర పరిస్థితులను మార్చేస్తాయి. ఇప్పటివరకు మీరు రెండువైపులా (ఎల్‌డీఎఫ్- యూడీఎఫ్‌లను ఉద్దేశిస్తూ) మాత్రమే చూశారు. అవి రాష్ట్రాన్ని నాశనం చేశాయి. మూడోవైపు ఉంది. అది అభివృద్ధి, సుపరిపాలనను అందిస్తుంది. అదే భాజపా.
ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లకి వేర్వేరు జెండాలు ఉన్నప్పటికీ.. వాటి అజెండా ఒక్కటే. అదే అవినీతి, జవాబుదారీతనం లేకపోవడం. ఇప్పుడు ప్రజల అభివృద్ధికి తోడ్పడే ప్రభుత్వం అవసరం, ఆ పని మేం చేస్తాం' అని నరేంద్ర మోడీ అన్నారు. కేరళ ప్రజలు భాజపాపై నమ్మకం ఉంచి.. తమతో చేతులు కలపాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శబరిమల ఆలయంలో బంగారు చోరీ గురించి ఆయన ప్రస్తావించారు. దీనిపై విచారణ జరిగేలా చూడటం 'మోదీ గ్యారెంటీ' అని పేర్కొన్నారు.