బుధవారం, 11 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 ఫిబ్రవరి 2026 (16:28 IST)

అమెరికా ఒత్తిడికి లొంగిపోయిన ప్రధాని మోడీ : రాహుల్ ధ్వజం

Rahul Gandhi
ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు విమర్శలు గుప్పించారు. ప్రధాన మోడీ అమెరికా ఒత్తిడికి లొంగిపోయారంటూ ఆరోపించారు. భారత్ అమెరికా దేశాల మధ్య గత నాలుగు నెలలుగా ఖరారు ఒప్పందం అకస్మాత్తుగా రాత్రికి రాత్రే ఎలా ఖరారైందని ఆయన ప్రశ్నించారు. పైగా, ఈ ఒప్పందం ద్వారా రైతుల కష్టాన్ని అమ్మేశారని ఆయన విమర్శించారు. 
 
'దాదాపు నాలుగు నెలలుగా నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందం సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా ఎందుకు ఖరారైందో మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో ప్రధానిపై తీవ్ర ఒత్తిడి ఉంది. అమెరికాలో వ్యాపారవేత్త అదానీపై కేసు వంటి వ్యవహారాలు దీనికి కారణం. వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని రాజీ పడ్డారు. రైతుల కష్టాన్ని, మొత్తం దేశాన్నే అమ్మేశారు' అని రాహుల్‌ విమర్శలు చేశారు.
 
అంతకుముందు భారత సైన్యం మాజీ అధిపతి ఎం.ఎం.నరవణె రాసిన ఆత్మకథలోని అంశాలపై లోక్‌సభలో రెండో రోజూ గందరగోళం కొనసాగింది. ప్రభుత్వం తనను మాట్లాడనివ్వడం లేదని రాహుల్‌ ఆరోపించారు. చరిత్రలో మొదటిసారి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేందుకు ఓ ప్రతిపక్ష నేతకు అనుమతి ఇవ్వలేదన్నారు.
 
ఎం.ఎం.నరవణె రాసిన ఆత్మకథను ఉటంకిస్తూ తాను ప్రస్తావించిన అంశాలతో కూడిన కథనం ప్రతిని రాహుల్‌ ధ్రువీకరించారు. స్పీకర్‌ ఆదేశాలను గుర్తుచేస్తూ.. ఆ కథనం కాపీని అథెంటికేట్ చేసినట్లు చెప్పారు. ఎంపీలు ఏదైనా డాక్యుమెంట్‌ను ధ్రువీకరించాలంటే.. తమకు తెలిసినంత వరకు అందులోని విషయాలు సరైనవేనని పేర్కొంటూ సంతకం చేసిన కాపీని సమర్పించాల్సి ఉంటుంది.