1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. NDA inches towards two-thirds majority in Rajya Sabha; short in Lok Sabha despite TMC rebellion

రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువలో ఎన్డీయే

parliament
రాజ్యసభలో ఎన్డీయే బలం పెరుగుతోంది. మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువలోకి రానుంది. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం కారణంగా ఆ పార్టీకి చెందిన పలువురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. దీంతో ఎన్డీయే ఎగువ, దిగువ సభల్లో బలం పుంజుకుంటోంది. ముఖ్యంగా రాజ్యసభలో మూడింట రెండొంతుల (2/3) మెజారిటీకి చేరువవుతోంది. రాజ్యాంగ సవరణ బిల్లుల సమయంలో ఈ మెజారిటీ ఎన్డీయేకు ఉపయోగపడుతుంది. అదేసమయంలో లోక్‌సభలో మాత్రం మూడింట రెండొంతుల మెజారిటీకి ఇంకాస్త దూరంలో నిలవనుంది.
 
జార్కండ్, మిజోరంలో రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు (భాజపా మద్దతు) గెలిస్తే ఎన్డీయే బలం 151కి చేరుకుంటుంది. తృణమూల్‌ నుంచి ఇటీవల ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన నేపథ్యంలో ఉపఎన్నికలు రానున్నాయి. ఉప ఎన్నికలు నిర్వహించే ఈ మూడుసీట్లనూ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో ఎన్డీయే సంఖ్యా బలం 154కు చేరనుంది. అయినప్పటికీ మూడింట రెండొంతుల మెజారిటీకి 163 మంది ఎంపీల మద్దతు అవసరం. అంటే 9 స్థానాలు తక్కువ పడతాయి. మరింత మంది తృణమూల్‌ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి ఎన్డీయేలో చేరితే 163 మార్కును చేరుకోవడం సాధ్యమవుతుంది.
 
ఈ యేడాది నవంబర్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న 10 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీ బలం పెరిగిన నేపథ్యంలో ఆ పార్టీ కొందరు ఎంపీలను రాజ్యసభకు పంపేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆ మేర భాజపా ఎంపీల సంఖ్య తగ్గనుంది. ఒకవేళ 2/3 మెజారిటీ సాధించినా కొన్ని నెలల మురిపెం కానుంది. 
 
మరోవైపు ఇండియా కూటమికి పెద్దల సభలో 64 మంది ఎంపీలు ఉన్నారు. డీఎంకేకు చెందిన 8 మంది, ఆప్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఇండియా కూటమికి దూరంగా ఉండడంతో విపక్ష కూటమి బలం తగ్గుముఖం పట్టింది. మరోవైపు వైఎస్సార్‌సీపీ 7, బీజేడీ 7, వైగోకు చెందిన ఎండీఎంకేకు ఒక ఎంపీ ఉన్నారు. కీలక బిల్లుల సమయంలో వీరు ఎటువైపైనా మొగ్గు చూపొచ్చు. 
 
రాజ్యసభలో ఎన్డీయే ఎంపీల సంఖ్యా బలం పెరిగినా లోక్‌సభలో 2/3 కష్టమేనంటున్నాయి రాజకీయ వర్గాలు. తృణమూల్‌ నుంచి వేరుపడిన 20 మంది ఎంపీలు ఎన్డీయేకు మద్దతు తెలుపుతూ సోమవారం లేఖ ఇవ్వనున్నారు. దీంతో ఎన్డీయే సంఖ్య బలం 314కు చేరనుంది. మూడింట రెండొంతుల బలం సాధించాలంటే 363 మంది ఎంపీల మద్దతు అవసరం. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
గెలిచినా ఓడినా నేర్చుకోవడం ఆపొద్దు : రష్మిక మందన్నా