ఆదివారం, 15 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 ఫిబ్రవరి 2026 (21:30 IST)

NEET UG 2026 : దరఖాస్తుల ఆహ్వానం.. రెండు కొత్త నిబంధనలు తెచ్చిన ఎన్టీఏ

neet exam
దేశంలోని వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2026 పరీక్షకు ఎన్టీఏ ఆదివారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పరీక్ష మే 3వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. అయితే, ఈ యేడాది నిర్వహించే పరీక్షలో పరీక్షా కేంద్రం కేటాయింపులో సరికొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. విద్యార్థి దరఖాస్తులో ఏ చిరునామా అయితే పేర్కొంటారో ఆ చిరునామా పరిధిలోనే పరీక్షా కేంద్రాన్ని కేటాయించనున్నారు. 
 
ఈ దరఖాస్తులు ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ రాత్రి 9 గంటల వరకు స్వీకరిస్తారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. అలాగే, అభ్యర్థి  గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్ ఆధారిత ఈకేవైసీని ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించే సమయంలో లైవ్ ఫోటో క్యాప్చర్ చేయడం తప్పనిసరి చేసింది. 
 
తద్వారా సిస్టమ్ మీ లైవ్ ఫోటోని ఆటోమేటిక్‌గా ఆధార్‌తో సరిపోల్చుతుంది. ఒకవేళ మీ లైవ్ ఫోటో ఆధార్‌తో సరిపోలకపోతే అందుకు వీలుగా మీ గుర్తింపును నిర్ధారించేలా తగిన ధృవీకరణ పత్రాలను అదనంగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారంలో పొందుపరిచిన ప్రస్తుత, శాశ్వత చిరునామా ఆధారంగానే పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు. 
 
ఈ పరీక్ష రాసే అభ్యర్థుల్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1700, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్‌సీఎల్ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, పరీక్షా కేంద్రాల సమాచారాన్ని తర్వాత వెల్లడిస్తారు. నీట్ ప్రవేశ పరీక్ష మే 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 3 గంటల పాటు జరుగుతుంది. ఈ ప్రవేశ పరీక్షల ద్వార ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎంఎంఎస్, బీయుఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్చుల్లో ప్రవేశాలు చేపడుతారు.