శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 జనవరి 2016 (15:10 IST)

దళితుడి కిడ్నీనా.. మేం కొనుగోలు చేయం :: ఐఐటీ-భువనేశ్వర్ దళిత విద్యార్థికి చేదు అనుభవం.. మన భారత్‌లోనే...

మన దేశంలో అంటరానితనం ఏ మేరకు ఉందో మరోమారు నిరూపితమైంది. సమాజంలో ఇప్పటికీ అంటరానితనం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే దళితులు తమతమ ప్రాంతాల్లో అడుగుపెట్టే పరిస్థితేలేదు. ఈ అంటరానితనం మనుషులకే కాదు.. చివరకు శరీర ఆవయవాలకు కూడా పాకింది. చదువు కోసం ఓ కిడ్నీని అమ్ముకుందామని భావించిన ఓ దళిత యువకుడికి జీవితంలో ఓ చేదు అనుభవం ఎదురైంది. దళితుడి కిడ్నీనా.. మేం కొనుగోలు చేయమంటూ ఏ ఒక్క కిడ్నీ బ్రోకర్ ముందుకురాలేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
మహేశ్ బాల్మీకి అనే విద్యార్థి ఐఐటీ భువనేశ్వర్‌లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చదువంటే వల్లమాలిన ప్రేమ. అందుకే చిన్నప్పటి నుంచీ క్లీనర్‌గా పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ తన విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు. అయితే, మహేష్ తరచూ అనారోగ్యం బారినపడుతూ వచ్చాడు. ఈ పరిస్థితుల్లో కూడా పదో తరగతిలో 85 శాతం, ఇంటర్మీడియేట్‌లో 70 శాతం మార్కులు సాధించాడు. ఐఐటీ ఎంట్రన్స్ టెస్ట్‌లో మంచి ఫలితాలు రావడంతో భువనేశ్వర్‌లో అడ్మిషన్ లభించింది. 
 
అయితే తాను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారేందుకు మెరుగైన వైద్యం చేసుకుని ఉన్నత చదువులు చదవాలని భావించాడు. అదేసమయంలో తన చదువుల కోసం తాను చేసిన రూ.2.7 లక్షల అప్పు తీర్చేందుకు తన కిడ్నీని అమ్మాలని చాలా ప్రయత్నించి, బ్లాక్ మార్కెట్ కిడ్నీ వ్యాపారులను సంప్రదించగా, అక్కడ పూర్తిగా నిరాశే ఎదురైంది. 
 
ఇదే విషయంపై మహేశ్ స్పందిస్తూ.. ముందుగా తన కులం గురించి వారు వాకబు చేసేవారని వాపోయారు. వారణాసి, అల్వార్‌లలో దాదాపు ఐదు ఆస్పత్రులకు తిరిగానని, తాను దళితుడినైనందున తన కిడ్నీని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అక్కడి వైద్యులు చెప్పారన్నారు.
 
తన కిడ్నీని ఎవరూ కొనకపోవడంతో నిరాశతో చదువు అర్థాంతరంగా ఆపేసి రాజస్థాన్‌లోని తన స్వస్థలం అల్వార్‌ వెళ్లిపోయినట్టు చెప్పాడు. నెలకు రూ.4,000 సంపాదించడం కోసం స్వీపర్ ఉద్యోగంలో చేరినట్లు తెలిపారు. తీవ్ర మానసిక ఆందోళన అనుభవిస్తూ ఇక తాను బతకనని, ఆత్మహత్య చేసుకుంటానని స్నేహితులకు చెప్పగా, వారంతా కలిసి తన సమస్యను మెగసెసే అవార్డు గ్రహీత సందీప్ పాండే దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. 
 
ఆయన తక్షణమే స్పందించి ఐఐటీ భువనేశ్వర్ పూర్వ విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించి ఇచ్చారని, ఆ సొమ్ముతో తన అప్పులు తీర్చేశానని వివరించారు. తన తండ్రి పక్షవాతంతో బాధపడుతున్నారని, తల్లి స్వీపర్‌గా ఉద్యోగం చేస్తున్నారని ఆ విద్యార్థి వాపోయాడు. ఈ సంఘటన మన దేశంలో మూత్రపిండాలు అమ్ముకోవడానికి కూడా కులం అడ్డుగోడగా నిలుస్తోందని తెలుస్తోంది.