ఆదివారం, 2 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 ఆగస్టు 2025 (12:48 IST)

నకిలీ ఇంటర్నేషనల్ రాయబార ఆఫీస్‌ : కేటుగాళ్ల నిర్వాకం

Fake Police Station
ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొందరు కేటుగాళ్లు నకిలీ రాయబార కార్యాలయం ఏర్పాటు చేసి దొరికిపోగా, తాజాగా అటువంటి ఘరానా మోసమే మరొకటి వెలుగు చూసింది. ఈసారి కేటుగాళ్లు ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్‌నే ఏర్పాటు చేయడం విశేషం. నకిలీ ఐడీ కార్డులు, ధ్రువపత్రాలతో పోలీసుల అవతారమెత్తి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘరానా మోసానికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్ పోలీసులు ఆరుగురు కేటుగాళ్లను అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. నోయిడాలోని సెక్టార్ 70లో ఇంటర్నేషనల్ పోలీస్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పేరుతో కేతుగాళ్ళు కొత్తగా ఓ కార్యాలయాన్ని తెరిచారు. కార్యాలయం బయట బోర్డులు కూడా పెట్టారు. అది చూస్తే నిజమైన పోలీస్ స్టేషన్ మాదిరిగా కనిపించేలా తీర్చిదిద్దారు.
 
దీనిపై సమాచారం అందుకున్న గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు ఆ కార్యాలయంపై ఆకస్మిక దాడి చేసి సోదాలు జరిపారు. ఇది ఒక నకిలీ కార్యాలయం అని, పది రోజుల క్రితమే దీన్ని ప్రారంభించినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి ఆరుగురు కేటుగాళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి మొబైల్ ఫోన్లు, చెక్ బుక్‌లు, రబ్బర్ స్టాంప్‌లు, కార్డులు, లెటర్ హెడ్‌లు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
 
ఇందులో పోలీస్ డిపార్టు‌మెంట్ మాదిరిగా లోగోలు, పలు కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన ఫోర్జరీ ధ్రువపత్రాలు, ఇంటర్ పోల్, అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్, తదితర సంస్థలతో అనుబంధం ఉన్నట్లుగా చూపించే డాక్యుమెంట్లు, అనేక ఐడీ కార్డులు, అధికారిక స్టాంపులు ఉండటం గమనార్హం.
 
అంతేకాకుండా బ్రిటన్‌లోనూ తమ కార్యాలయం ఉందని పేర్కొనడం విశేషం. వీరు ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ ఓ వైబ్ సైట్ ద్వారా విరాళాలను కూడా సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా మోసానికి సంబంధించి తొలి దశలోనే గుట్టురట్టు చేశామని, బాధితులను గుర్తించే పనిలో ఉన్నామని అధికారులు తెలిపారు.