దేశంలో ఖాళీ అవుతున్న చమురు నిల్వలు... పెట్రోల్ - డీజల్ - ఎల్పీజీ వినియోగంపై ఆంక్షలు?
అమెరికా - ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు కొరత ఉత్పన్నమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ముడి చమురును రవాణా చేసే ప్రధాన జలమార్గమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో అనేక ప్రపంచ దేశాలకు దిగుమతి కావాల్సిన చమురు రవాణా స్తంభించిపోయాయి. ఈ ప్రభావం భారత్‌పై మరింత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్న చమురు నిల్వవలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. దీంతో పెట్రోల్ - డీజల్ వినియోగంపై ఆంక్షలు అమలు చేసే దిశగా కేంద్రం యోచన చేస్తోంది.
సాధారణంగా రోజుకు 19.8 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ మార్గం ద్వారా రవాణా కావాల్సి ఉండగా ఈ నెల ఒకటో తేదీ నాటికి అది ఏకంగా 86 శాతం పడిపోయి కేవలం 2.8 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంది. చమురు సరఫరాలో అంతరాయం ఇలాగే కొనసాగితే, దేశీయ అవసరాల దృష్ట్యా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
భారత్ తను ఉత్పత్తి చేసే పెట్రోల్లో మూడో వంతు, డీజిల్లో నాలుగో వంతు విదేశాలకు ఎగుమతి చేస్తుంది. దేశీయంగా కొరతరాకుండా ఉండటం కోసం ఈ ఎగుమతులను నిలిపివేసి, ఆ నిల్వలను స్థానిక వినియోగానికే మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది.
గల్ఫ్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో భారత్ ఇప్పుడు రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను మరింత పెంచుకోవాలని చూస్తోంది. అలాగే అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి చమురు సేకరణకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం 'రోజుల పాటు కాదు, వారాల పాటు' సాగే అవకాశం ఉందని హెచ్చరించడం భారత్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలకు ఇంధన లభ్యతలో ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చమురు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అలాగే, భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 80-85 శాతాన్ని గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుత నిల్వలు కేవలం రెండు వారాలకు మాత్రమే సరిపోతాయని అంచనా. ఈ నేపథ్యంలో గృహ అవసరాలకు సిలిండర్ల సరఫరాపై ప్రభుత్వం 'రేషనింగ్' (పరిమిత సరఫరా) విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.