శుక్రవారం, 23 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 డిశెంబరు 2025 (21:55 IST)

పాకిస్థాన్ వంకర బుద్ధి పోలేదు.. ఆపరేషన్ సిందూర్ 2.0 తప్పేలా లేదు : దుశ్యంత్ సింగ్

dushyanth singh
పాకిస్థాన్ తన వంకర బుద్ధిని ఇంకా మార్చుకోలేదని, అందువల్ల ఆపరేషన్ సిందూర్ 2.0 తప్పేలా లేదని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ దుశ్యంత్ సింగ్ అభిప్రాయపడ్డారు. భారత సాయుధ దళాలు దీనికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఇప్పటికీ అస్థిరంగా ఉందని, ఎల్‌వోసీ వెంబడి పాక్‌ పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతోందని మండిపడ్డారు. 
 
'సెంటర్‌ ఫర్‌ ల్యాండ్ వార్‌ఫెర్‌ స్టడీస్‌' డీజీగానూ ఉన్న ఆయన.. గుజరాత్‌లోని వాయుసేన నైరుతి ఎయిర్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈమేరకు ప్రసంగించారు. 'ఆపరేషన్‌ సిందూర్‌ ముగింపు కాదు. యుద్ధాన్ని నిర్వహించే విషయంలో కొత్త అధ్యాయానికి నాంది. మన ప్రత్యర్థితో భవిష్యత్తులోనూ వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. 
 
చైనా, తుర్కియేల మద్దతుతో కశ్మీర్ వివాదంపై పాక్‌ రెచ్చగొడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 'ఆపరేషన్ సిందూర్ 2.0' అనేది అనివార్యం. దాని కోసం ఎంత త్వరగా సిద్ధమైతే.. అంత మంచిది. 'ఆపరేషన్‌ సిందూర్‌' పాకిస్థాన్‌ బలహీనతలను బయటపెట్టింది. 1971 యుద్ధం తర్వాత మొదటిసారి మన త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయి. సైనికపరంగా సత్తా చాటేందుకు రాజకీయ స్పష్టత దోహదపడింది' అని తెలిపారు.
 
'చైనా సోషల్ మీడియా నెట్‌వర్క్‌ల మద్దతుతో పాకిస్థానీ ఇన్‌ఫ్లుయెన్సర్లు టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో రెచ్చిపోయారు. ఆపరేషన్ సిందూర్‌ సమయంలో భారత ప్రభుత్వ నెట్‌వర్క్‌లపై సైబర్ దాడులు ఏడు రెట్లు పెరిగాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ దాదాపు 40 కోట్ల సైబర్ దాడులు ఎదుర్కొంది. ఒకవేళ అవి విజయవంతమైతే.. ఆర్థిక సంక్షోభానికి దారితీసేది. భారత్‌కు మెరుగైన జాతీయ భద్రతా వ్యూహం అవసరం. ఇంటెలిజెన్స్‌, అంతర్గత భద్రత రంగాలను సంస్కరించాలి. రక్షణ వ్యయాన్ని జీడీపీలో 3 శాతానికి పెంచాలి' అని సూచించారు.