ప్రధాని మోడీపై దాడికి విపక్ష సభ్యుల కుట్ర? అందుకే సభకు రావొద్దని చెప్పా : స్పీకర్ ఓం బిర్లా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చుట్టుముట్టేందుకు విపక్ష సభ్యులు పథక రచన చేశారని, ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి ప్రధానమంత్రిని సభకు రావొద్దని తానే చెప్పానని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి. దీంతో ఎనిమిది మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, 'బుధవారం పార్లమెంట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరం. కాంగ్రెస్ మహిళా ఎంపీల ప్రవర్తనను ఖండిస్తున్నాను. విపక్షాల తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు' అని అన్నారు.
తనకు అందిన సమాచారం ఆధారంగా, ప్రధాని భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఆ కారణం వల్లే ప్రధాని సభలో ప్రసంగించలేకపోయారని తెలిపారు. సభకు రాకుండా ఉండేందుకు అంగీకరించిన ప్రధాని.. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఇవ్వలేదన్నారు. అందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు పీటీఐ కథనం వెల్లడించింది.
ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్‌సభ గురువారం ఆమోదించింది. 'ఈ తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడకపోవడం అరుదైన అంశం. ప్రసంగించేందుకు మోడీ అందుబాటులోనే ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ సభ్యుల ప్లాన్‌కు సంబంధించిన సమాచారం రావడంతో బుధవారం సభను వాయిదా వేయాలని స్పీకర్ నిర్ణయించారు' అని లోక్‌సభ వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే.