సీఎం విజయ్... మీ పాలన అద్భుతంగా సాగాలి : ప్రధాని నరేంద్ర మోడీ
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధ్యక్షుడు, సినీ హీరో విజయ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి విజయ్ పాలన అద్భుతంగా సాగాలని ఆకాంక్షించారు. ప్రజల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందని అన్నారు.
అలాగే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కు అభినందనలు. ఈ ప్రజా తీర్పు సమాజంలో పెరుగుతున్న యువ గళాన్ని ప్రతిబింబిస్తోంది. దీనిని ఎప్పటికీ విస్మరించబోము. కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రజల కోసం కృషి చేస్తూనే ఉంటుంది అని పేర్కొన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కు అభినందనలు. ప్రజలకు సమన్యాయం, సంక్షేమంతో కూడిన పాలన అందిస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుస్తారని బలంగా నమ్ముతున్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.
సీఎం విజయ్ సారథ్యంలో కొలువుదీరిన తమిళనాడు సర్కారు
తమిళనాడు రాష్ట్రంలో సినీ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ సారథ్యంలో కొత్త సర్కారు కొలువు దీరింది. రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా సి.జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు గవర్నర్ ఆర్వీ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ, సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు. నటి త్రిష వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆయనతో పాటు మరో 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో బుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున, కేజీ అరుణ్ రాజ్, కేఏ సెంగోట్టయ్యన్, వెంకట్రామన్, నిర్మల్ కుమార్, రాజ్‌మోహన్, టీకే ప్రభు, కీర్తనలు ఉన్నారు.
కాగా, విజయ్ శనివారం సాయంత్రం 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్‌కు సమర్పించడంతో గవర్నర్ ఆర్లేకర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం విజయ్‌ను ముఖ్యమంత్రిగా నియమించి, అందుకుగాను ఉత్తర్వు జారీ చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన విజయ్‌ను ఆహ్వానించారు. దీని ప్రకారం, ఆదివారం ఉదయం 10 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
విజయ్ తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఈ 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీతో పాటు రాజేష్ కుమార్, విశ్వనాథన్ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పినప్పటికీ, వారి పేర్లను చేర్చలేదు.
