భోగి పండుగ - పొంగలి తయారు చేసిన ప్రధాని మోడీ
సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా, భోగి పండుగ రోజై బుధవారం నరేంద్ర మోడీ పొంగలి వండారు. కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఇంట జరిగిన సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత గోవులకు పూజ చేసి, ఆ తర్వాత పొంగలి వండారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, గత యేడాది తాను తమిళనాడులో జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైనట్లు గుర్తు చేసుకున్నారు. వెయ్యి సంవత్సరాల పురాతనమైన గంగైకొండ చోళపురం ఆలయ సందర్శన, పంబన్ వంతెన ప్రారంభోత్సవ సమయాల్లో తమిళుల చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.
కొన్ని నెలల క్రితం సహజ వ్యవసాయంపై తమిళనాడులో జరిగిన ఓ సమావేశానికి తాను హాజరైనట్లు మోడీ తెలిపారు. అక్కడ లాభదాయకమైన వృత్తులను వదిలి వ్యవసాయం వైపు మళ్లిన యువతను కలిశానని, వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తీసుకురావడానికి వారు చేస్తున్న కృషిని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
దేశంలో వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, పర్యావరణానికి అనుకూలంగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, నీటి నిర్వహణ, సహజ వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత వంటివి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రైతులు దేశ నిర్మాణంలో బలమైన భాగస్వాములని వారిని మరింత శక్తిమంతంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం నిబద్ధతతో పనిచేస్తోందన్నారు.