నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వెనుక బ్యూటీషియన్
ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 వెనుక ఓ బ్యూటీషియన్ హస్తమున్నట్టు సీబీఐ ప్రాథమికంగా గుర్తించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న జువాలజీ ఉపాధ్యాయురాలు మనీషా గురునాథ్ మందారేను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ లీక్ వెనుక ఒక బ్యూటీషియన్ హస్తమున్నట్టు సమాచారం.
మనీషా వాఘ్మారే.. మహారాష్ట్రలోని పుణెలో బ్యూటీ పార్లర్ నడుపుతోంది. ఆమెను మే 14న సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉంది. ఆమె అరెస్టు అయిన రోజే కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీవీ కులకర్ణిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రోజు బోటనీ ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మందరే అరెస్టు అయ్యారు.
నీట్ ప్రశ్నపత్రం తయారీ ప్యానల్‌లో సభ్యురాలైన మనీషా గురునాథ్ మందారేకు బోటనీ, జువాలజీ పేపర్ల యాక్సెస్ ఉందని కోర్టుకు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. వాఘ్మారే, కులకర్ణి సహా ఇతర నిందితులతో కలిసి మనీషా గురునాథ్ కుట్ర పన్నారని, పరీక్షలో వచ్చే ప్రశ్నలను భారీగా డబ్బు ఇవ్వగలిగే విద్యార్థులకు అందించినట్లు తెలుస్తోంది.
ఈ లీకేజీ కుట్రలో వాఘ్మారే పాత్ర కీలకమని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ప్రశ్నపత్రం తయారీలో మనీషా గురునాథ్ ప్రమేయం ఉందని తెలుసుకొని, ఆమెతో కలిసి ఓ పథకం పన్నిందని పేర్కొన్నాయి. తమ ప్లాన్‌లోకి కులకర్ణిని చేర్చుకున్నారు. పేపర్ కొనేందుకు సరైన విద్యార్థుల కోసం బ్యుటీషియన్ వెతికింది. ఇందులోభాగంగా ఆమె కొందరు విద్యార్థులను గుర్తించి వారితో రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అలాగే తన ప్లాన్‌ను స్నేహితుడు ధనంజయ్ లోఖండేతోనూ పంచుకుందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
ఈ క్రమంలో ధనంజయ్ నాసిక్‌లో కౌన్సెలింగ్ బిజినెస్ నడుపుతోన్న శుభమ్ ఖైర్నార్‌ను సంప్రదించాడు. ఈ వ్యవహారంలో తొలుత శుభమ్ అరెస్టయ్యాడు. పరీక్ష రద్దయిన కొన్ని గంటల్లోనే అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వాఘ్మారే నుంచి నీట్ పేపర్లు ధనంజయ్‌కు, అక్కడి నుంచి శుభమ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. గురుగ్రామ్, జైపుర్‌లోని ఏజెంట్లకు అతడు పీడీఎఫ్‌లు పంపాడని ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో మరో అరెస్టు చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని లాతూర్‌లో రేణుకై కెమిస్ట్రీ క్లాసెస్ ఫౌండర్ శివరాజ్ రఘునాథ్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ప్రశ్నపత్రం లీకేజీ, దానిని ఇతరులకు చేరవేసిన గ్యాంగ్‌లో శివరాజ్ సభ్యుడని దర్యాప్తులో భాగంగా గుర్తించారు. ఈ క్రమంలో జరిపిన సోదాల్లో భాగంగా అతడి ఫోన్‌లో లీక్ అయిన ప్రశ్నపత్రం కనిపించినట్లు తెలుస్తోంది. దాంతో అతడిని అరెస్టు చేశారు.
