కేతన్ అగర్వాల్ హత్య కేసు : సియా - చేతన్‌లకు ముందుగానే వివాహమైందా?
మహారాష్ట్ర, పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్‌లకు గతంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ముఖ్యంగా, కేతన్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాతే వీరు వివాహం చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
కేతన్ అగర్వాల్‌తో సియాకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబరులో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పెళ్లి ఇష్టం లేని సియా... ఇంట్లో వాళ్లకు చెప్పకుండా నాలుగు నెలల కిందటే పుణెలోని స్థానిక రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రియుడు చేతన్‌ను పెళ్లి చేసుకుందట. దీనికి ఇద్దరు స్నేహితులు సాక్షి సంతకాలు చేసినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా సియా, చేతన్ ఫోన్లలోని వాట్సప్ సంభాషణలను పరిశీలించడంతో ఈ విషయం బయటపడినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.
దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక వివాహ చట్టం కింద వీరికి వివాహ ధ్రువీకరణ పత్రం జారీ అయ్యిందా అనేది వెరిఫై చేస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా.. ఈ పెళ్లి ఫొటోలను సియా తన ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందట. అయితే, ఆ తర్వాత వాటిని డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక బృందాల సాయంతో ఆ ఫొటోలను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
జూన్ 18న కేతన్ అగర్వాల్ లోయలో పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పుణెలోని చారిత్రక లోహగఢ్ కోట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా పోలీసులు భావించగా.. ఆ తర్వాత దాన్ని హత్యగా తేల్చారు. ప్రియుడుతో కలిసి సియానే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధరించిన పోలీసులు వీరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
